ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు సీట్లు నిరాకరిస్తున్న ఐఐటీలు

  • ఫ్యాకల్టీ నియామకాలు, పిహెచ్‌డి ప్రవేశాలలో ఇదే పరిస్థితి
    నిత్యకృత్యమైన వేధింపులు, వివక్ష
    ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు

న్యూఢిల్లీ : ఫ్యాకల్టీ నియామకాలు, పిహెచ్‌డి ప్రవేశాల స్థాయిలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు దక్కాల్సిన రిజర్వేషన్‌ కోటాను ఐఐటీలు తోసిపుచ్చుతున్నాయి. ఆయా వర్గాలకు సీట్లు నిరాకరిస్తున్నాయి. దీంతో ఆ సంస్థల్లో వారి ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఐఐటి ఖరగ్‌పూర్‌లో పిహెచ్‌డి అడ్మిషన్ల సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు చెందిన 34 మంది విద్యార్థులకు సీట్లు నిరాకరించారు. ఈ సంస్థలో 45 డిపార్ట్‌మెంట్లు ఉండగా వాటిలో 43 డిపార్ట్‌మెంట్లలో ఒక్క ఎస్‌సి ఫ్యాకల్టీ కూడా లేరు. గత సంవత్సరం ఈ సంస్థలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి తరగతులకు చెందిన ఒక్క మహిళా ఫ్యాకల్టీని కూడా నియమించలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగు చూశాయి.
ప్రభుత్వ, న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ ఫ్యాకల్టీ నియామకాలు, పిహెచ్‌డి అడ్మిషన్లలో రిజర్వేషన్‌ నిబంధనల్ని ఖరగ్‌పూర్‌ ఐఐటి ఉల్లంఘించిందని విద్యార్థులు ఆరోపించారు. పైగా ఆయా వర్గాల విద్యార్థులపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయని, వివక్ష జడలు విప్పుతోందని, దీనిని భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో గత ఐదు సంవత్సరాల కాలంలో 13,500 మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు. ఈ సంవత్సరం జనవరి నాటికి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో 742 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. వీరిలో 92% మంది జనరల్‌ కేటగిరీ వారే. 40 మంది ఒబిసి, 17 మంది ఎస్‌సి లు, కేవలం ఇద్దరు మాత్రమే ఎస్‌సి లు ఫ్యాకల్టీ స్థాయిలో ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రవేశాలు, ఫ్యాకల్టీ నియామకాలలో ఎస్‌సి లకు 15%, ఎస్‌సి లకు 7.5%, ఒబిసిలకు 27% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. గత సంవత్సరం ఈ సంస్థలో ఒక్క ఎస్‌సి ని కూడా ఫ్యాకల్టీగా తీసుకోలేదు.
గత ఏడాది ఖరగ్‌పూర్‌ ఐఐటి 101 మంది బోధనా సిబ్బందిని నియమించింది. వీరిలో ఎస్‌సి లు ఇద్దరు మాత్రమే ఉండగా ఒబిసిలు పది మంది ఉన్నారు. పిహెచ్‌డి అడ్మిషన్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. 345 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే వారిలో ఎస్‌సి లు 46, ఎస్‌సిలు 9, ఒబిసిలు 82 మంది ఉన్నారు. ఇది ఒక్క ఖరగ్‌పూర్‌ ఐఐటిలో నెలకొన్న పరిస్థితి మాత్రమే. దేశంలో మొత్తం 22 ఐఐటిలు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా బలహీన వర్గాలకు సీట్లను నిరాకరిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ ఐఐటిలో 32 డిపార్ట్‌మెంట్లు ఉండగా వాటిలో 25 బ్రాంచీలలో ఒక్క ఎస్‌సి విద్యార్థి కూడా లేడు. పది డిపార్ట్‌మెంట్లలో ఎస్‌సి విద్యార్థి లేడు. ఆరింటిలో ఒబిసి విద్యార్థులు లేరు. పిహెచ్‌డి ప్రవేశాలలో సుమారు 70% జనరల్‌ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. ఫలితంగా బలహీనవర్గాలకు దక్కాల్సిన 132 సీట్లను ఢిల్లీ ఐఐటి నిరాకరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంస్థలో ఇద్దరు ఎస్‌సి విద్యార్థులు మాత్రమే పిహెచ్‌డీలో అడ్మిషన్‌ పొందారు. గత ఎనిమిది నెలల కాలంలో ఐఐటీలలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు వేధింపులు, వివక్ష భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు దళితులు కాగా ఒకరు ఒబిసి. ఇక కాన్పూర్‌ ఐఐటిలో జనవరి నాటికి 567 మంది ఫ్యాకల్టీ సభ్యులు ఉండగా వారిలో 87% మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారే. ఈ సంస్థలోని 14 డిపార్ట్‌మెంట్లలో ఎస్‌సి ఫ్యాకల్టీలు లేరు. 19 బ్రాంచీలలో ఒక్క ఎస్‌సి ఫ్యాకల్టీ కూడా లేరు. మూడు బ్రాంచీలలో ఒబిసి ఫ్యాకల్టీలు లేరు. బాంబే ఐఐటీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రస్తుత సంవత్సరంలో 394 మంది ఈ సంస్థలో చేరగా వారిలో 66% మంది జనరల్‌ కేటగిరీకి చెందిన వారే. 20 బ్రాంచీలలో ఎస్‌సి విద్యార్థులు, 11 బ్రాంచీలలో ఎస్‌సి విద్యార్థులు, ఐదు డిపార్ట్‌మెంట్లలో ఒబిసి విద్యార్థులు లేరు.

➡️