ఎన్నికల బాండ్ల విషయంలో దొందూ దొందే !

– కాంగ్రెస్‌, బిజెపిలకు తేడా ఏమీ లేదు !
– కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
మల్లప్పురం (కేరళ) : కాంగ్రెస్‌ చర్యలు చూస్తుంటే బిజెపిని గుర్తు తెస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం విమర్శించారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంలో వెల్లడైన వివరాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమైపోతోందన్నారు. మల్లప్పురం జిల్లాలోని పతనంతిట్టలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ నిర్వహించిన ఎన్నికల సభలో విజయన్‌ ప్రసంగించారు. ఎన్నికల బాండ్ల పథకమనేది మెగా కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి ఇందులో కీలక పాత్ర పోషించిందన్నారు.
”కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పర్యవేక్షణలో చోటు చేసుకున్న ఎన్నికల బాండ్ల పథకం మెగా కుంభకోణం. బిజెపి ప్రారంభించిన ఈ పథకం కింద బాండ్ల ద్వారా పార్టీ ఏకంగా రూ.8251 కోట్లను సంపాదించింది. అయితే ఇందుకు బిజెపిని ఒక్కదాన్నే నిందిస్తే చాలదు. కాంగ్రెస్‌ భాగస్వామ్యం కూడా ఇందులో వుంది. ఆ పార్టీ రూ.1951 కోట్లు సంపాదించుకుంది.” అని ఆయన పేర్కొన్నారు.
సిపిఎం న్యాయపోరాట ఫలితమే..
ఎన్నికల బాండ్ల విషయంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరి ఆయన తన ప్రసంగంలో వివరించారు. ఈ కుంభకోణం వివరాలను బట్టబయలు చేసేందుకు సుప్రీం కోర్టులో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేపట్టిన న్యాయ పోరాటానికే ఈ ఖ్యాతి దక్కుతుందన్నారు. ఎన్నికల బాండ్లను కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. బాండ్లు అవినీతికి మరో రూపమని ఆయన వ్యాఖ్యానించారు. పారదర్శకత ప్రాముఖ్యతను విజయన్‌ నొక్కి చెప్పారు. ప్రజల సమాచార హక్కుకు హామీ కల్పిస్తూ ఏచూరి ఎన్నికల బాండ్ల అంశాన్ని సుప్రీం కోర్టు ముందుకు తీసుకువచ్చారన్నారు.
బిజెపి, కాంగ్రెస్‌లు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డాయో సుప్రీం తీర్పు వెల్లడించిందని విజయన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌తో సంబంధాలు కలిగిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ నుండి గణనీయమైన మొత్తాల్లో బిజెపికి నిధులు అందాయని విజయన్‌ విమర్శించారు. ఆంద్రప్రదేశ్‌లోని బిజెపి నేతకు సంబంధమున్న కంపెనీ నుండి కాంగ్రెస్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక తోడ్పాటు లభించిందని చెప్పారు. ఇక అటువంటపుడు బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య తేడా ఏమిటి? బిజెపి ప్రయోజనాలతో కాంగ్రెస్‌ స్థిరంగా పొత్త పెట్టుకుంది. కాంగ్రెస్‌ చేస్తున్న ఇలాంటి పనులన్నింటిలోనూ బిజెపి టచ్‌ వుంటోందన్నారు.

➡️