హపూర్‌ మూకదాడి కేసులో 10 మందికి జీవిత ఖైదు

Mar 13,2024 08:47 #Lynching, #Uttar Pradesh

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాపూర్‌ 2018 మూకదాడి కేసులో మొత్తం 10 మంది నిందితులను స్థానిక కోర్టు మంగళవారం దోషులుగా నిర్ధారించింది. 10 మందికీ జీవిత ఖైదు విధించింది. హపూర్‌ అదనపు జిల్లా జడ్జి (పోస్కో) శ్వేతా దీక్షిత్‌ ఈ మేరకు తీర్పు చెప్పారు. దోషులు రాకేష్‌, హరిఓమ్‌, యుధిష్థిర్‌, రింకూ, కరణ్‌పాల్‌, మనీష్‌, లలిత్‌, సోను, కప్తాన్‌, మంగేరామ్‌లకు ఒక్కొక్కరికీ రూ. 58 వేల జరిమానాను కూడా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది విజరు చౌహన్‌ మీడియాకు తెలిపారు. వీరంతా థౌలానా జిల్లాలోని బజైదా గ్రామానికి చెందినవారు. 2018 జూన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌కు సమీపంలో గోవధకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బజైదా గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఖసిం ఖురేషి, 62 ఏళ్ల సమాయదీన్‌పై అదే గ్రామస్థులు మూకదాడికి పాల్పడ్డారు. దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఖురేషి మరణించగా, సమాయదీన్‌ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ కేసును నీరుగార్చడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. మూకదాడికి బదులుగా మోటార్‌ సైకిల్‌ ప్రమాదంలో ఖురేషి మరణించినట్లుగా పోలీసులు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో సమాయదీన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని, ఈ కేసు విచారణను మీరట్‌ జోన్‌ ఐజి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

➡️