ఎంపిల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరం నిరసన

Dec 23,2023 08:59 #INDIA bloc, #Protest

న్యూఢిల్లీ :   పార్లమెంటు నుండి 146 మంది ఎంపిల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరం శుక్రవారం జంతర్‌ మంతర్‌ ఎదుట ఆందోళన చేపట్టింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) ఫోరం బ్యానర్‌పై జరిగిన ఈ నిరసనలో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, జెఎంఎం నుండి మహువా మజి, డిఎంకె నుండి తిరుచ్చి శివ, ఆర్‌జెడి నుండి మనోజ్‌ కుమార్‌ ఝా, టిఎంసి నుండి మౌసమ్‌ నూర్‌, ఎన్‌సి నుండి హస్నైన్‌ మసూది, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ నుండి ఎన్‌.కె. ప్రేమ చంద్రన్‌, ఎస్‌పి నుండి ఎస్‌.టి హసన్‌లు పాల్గన్నారు. బిజెపి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినందున పార్టీలన్నీ ఏకమయ్యాయని ఖర్గే పేర్కొన్నారు. ”అందరం ఏకమైతే.. మోడీ ఏమీ చేయలేరు. మమ్మల్ని ఎంత బలంగా అణచివేస్తే.. దానికి రెట్టింపు బలంగా పైకి లేస్తాం” అని అన్నారు. పార్లమెంటు భద్రతావైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసినందుకు ప్రతిపక్షాలను సస్పెండ్‌ చేశారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. 150 మంది ఎంపిలను సస్పెండ్‌ చేయడంతో మోడీ ప్రభుత్వం 60 శాతం భారతీయుల గొంతుకను అణచివేసిందని మండిపడ్డారు. బిజెపి విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంటే.. ఇండియా ఫోరంలోని పార్టీలు ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పంచుతున్నాయని అన్నారు. వామపక్షాలు సహా కాంగ్రెస్‌, డిఎంకె, ఎన్‌సిపి, ఎస్‌పి, ఎన్‌సి, టిఎంసి, జెఎంఎం, ఆర్‌జెడి, ఇతర పార్టీలు పాల్గొన్నాయి.

➡️