ఉత్తరాఖండ్‌ కార్చిచ్చుపై రేపు విచారణ

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ కార్చిచ్చుపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవేనని పిటిషనర్లు పేర్కొన్నారు. గతంలో చోటుచేసుకున్న కార్చిచ్చు ఘటనలకు సంబంధించిన కేసులు సుప్రీం కోర్టులో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు.విచారణ సమయానికల్లా స్టేటస్‌ రిపోర్ట్‌ను కోర్టుకు దాఖలు చేస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తెలిపింది. పరిస్థితి చాలా దారుణంగా, దిగ్భ్రాంతికరంగా వుంది. మొత్తంగా ఆ ప్రాంతాల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ పెద్దయెత్తున గాలిలో కలుస్తోందని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం నివేదికను అందజేసింది. దీనిపై విచారణ సమయంలో అమికస్‌ క్యూరీ, కేంద్ర సాధికార కమిటీని కూడా తీసుకురావాల్సి వుంటుందని జస్టిస్‌ గవారు పేర్కొన్నారు. గత ఆరు మాసాల్లో 900కి పైగా కార్చిచ్చు సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా 1100 హెక్టార్ల అటవీ భూములు తగలబడ్డాయి. వీటిలో 351 కేసులు మనుష్యుల వల్ల జరిగినవేనని వార్తా కథనాలు తెలుపుతున్నాయి. పదే పదే కార్చిచ్చు రగులుతున్నా నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వం, పట్టిపట్టని ధోరణి, సంసిద్ధత కొరవడడం వంటి కారణాలతో అడవులకు తీరని నష్టం జరుగుతోందని పిటిషన్‌దారులు పేర్కొంటున్నారు. దీనివల్ల వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందన్నారు.

➡️