అయోధ్య కేసులో తీర్పిచ్చిన ఆ అయిదుగురికి ఆహ్వానం

Jan 20,2024 11:04

న్యూఢిల్లీ, లక్నో : అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానం అందింది.వీరితో పాటు న్యాయ మరో 50మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. మాజీ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ ఆహ్వానం అందుకున్నవారిలో వున్నారు. అయోధ్య వివాదంలో 2019 నవంబరు 9న రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేయడం దారుణమైన నేరం అంటూనే, మసీదు కూలగొట్టబడిన స్థలాన్ని ఆలయ నిర్మాణానికి బదలాయించాలని కోర్టు ఆదేశించింది. దీనికి బదులుగా మసీదు నిర్మించుకునేందుకు ఐదెకరాల స్థలాన్ని యుపి వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని కోరింది. అయోధ్యలో కొలువుదీరనున్న బాలరాముని విగ్రహాన్ని 300 ఏళ్ల నాటి రాయితో చెక్కినట్లు భూగర్భ శాస్త్రవేత్త, మైసూరు యూనివర్శిటీ ఎర్త్‌్‌ సైన్సెస్‌ విభాగ ప్రొఫెసర్‌ సి.శ్రీకంఠప్ప తెలిపారు. దక్షిణ భారతదేశంలో వెలుగు చూసిన అత్యంత ప్రాచీన శిలల్లో ఇదొకటని చెప్పారు. మైసూరు జిల్లాలోని గుగ్గెగౌడన్నపురా క్వారీ నుంచి ఈ రాయిని తీసుకొచ్చినట్లు తెలిపారు.

అయోధ్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో భద్రత పర్యవేక్షణ

అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. 12 వేల మంది పోలీసులతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో భద్రత పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో ముగ్గురు వ్యక్తులను తీవ్రవాదులుగా అనుమానించి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. సైబర్‌ నేరగాళ్ల ముప్పును ఎదుర్కొనేందుకు హై లెవల్‌ సైబర్‌ నిపుణుల బృందాన్ని కేంద్ర హోం శాఖ అయోధ్యకు పంపించింది.

➡️