పొత్తు ఖరారు ?

Mar 8,2024 08:43 #alliance, #finalized
  • ఎన్‌డిఎ కూటమిలోకి టిడిపి !
  • అమిత్‌షా, నడ్డాతో చంద్రబాబు, పవన్‌ భేటీ
  • లోక్‌సభ స్థానాలపై ఏకాభిప్రాయం
  • అసెంబ్లీ స్థానాలపై కొనసాగుతున్న చర్చ
  • నేడు అధికారిక ప్రకటన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో గురువారం రాత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లు జరిపిన చర్చల్లో ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మరికొంత కసరత్తు తరువాత శుక్రవారం పొత్తులపై అధికారికంగా ప్రకటించ నున్నారని తెలిసింది. దీంతో ఎన్‌డిఎ కూటమిలోకి టిడిపి మరోసారి చేరినట్టైంది. జనసేన ఇప్పటికే ఈ కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు టిడిపి అధినేత చంద్రబాబు, ఎంపి కె.రామ్మోహన్‌ నాయుడు రాత్రి 10:19 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసానికి చేరుకున్నారు. ఆ తరువాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపి బాలశౌరి రాత్రి 10:36 గంటలకు అమిత్‌ షా నివాసానికి వెళ్లారు. సుదీర్ఘంగా సీట్ల పంపకాలపై చర్చించారు. బిజెపి ఆరు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు డిమాండ్‌ చేయగా, ఐదు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించినట్టు సమాచారం. సుదీర్ఘ చర్చ తరువాత బిజెపి పోటీ చేసే లోక్‌సభ స్థానాల విషయమై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

➡️