ఇజ్రాయిల్‌ డ్రోన్ల దాడి

Apr 20,2024 08:38 #Israeli drone attack

ఇసఫహాన్‌ వద్ద పేలుళ్లు
మూడు డ్రోన్లు కూల్చివేశామన్న ఇరాన్‌ ఆర్మీ
సరికొత్త ఆంక్షలతో విరుచుకుపడ్డ పశ్చిమ దేశాలు
టెల్‌అవీవ్‌ : ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ డ్రోన్ల దాడికి దిగింది. ఇసఫహాన్‌ మిలిటరీ వైమానిక స్థావరం వద్ద శుక్రవారం తెల్లవారు జామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయిల్‌ క్షిపణి దాడులే ఈ పేలుళ్లకు కారణమని అమెరికన్‌ అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు.. ఇరానియన్‌ ఆర్మీ మాత్రం మూడు డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశామని చెప్పింది. . ఇరాన్‌పై అమెరికా, దాని యూరప్‌ మిత్రులు ఇరాన్‌పై సరికొత్త ఆంక్షలతో విరుచుకుపడిన కొద్దిసేపటికే ఇజ్రాయిల్‌ ఈ దాడికి పాల్పడింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఎగదోయడంలో పశ్చిమ దేశాల పాత్ర తక్కువేమీ కాదు. ఇరాన్‌ మిలిటరీ ఇండిస్టీని మరింత బలహీన పరిచేలా ఆ దేశంపై అన్ని రకాల ఆంక్షలు విధించాలని బైడెన్‌ తన టీమ్‌ను ఆదేశించారు. ఇరాన్‌కు మద్దతిచ్చే దేశాలపై కూడా ఆంక్షలు విధిస్తామని బైడెన్‌ హూంకరించారు. ఇజ్రాయిల్‌ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శుక్రవారం మాట్లాడుతూ గత వారం ఇజ్రాయిల్‌పై జరిపిన ప్రతీకార చర్యను ప్రశంసించారు. ఇజ్రాయిల్‌ జరిపిన తాజా దాడి గురించి ఆయన అసలు ప్రస్తావించనేలేదు. ఇజ్రాయిల్‌పై తక్షణమే ఎలాంటి ప్రతీకార చర్య తీసుకునే యోచన లేదని ఇరాన్‌ అధికారులు చెప్పారు. ఇసఫహాన్‌ నగరం కీలకమైన అణు కేంద్రాలకు నిలయం. ఇజ్రాయిల్‌ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే దానికి సమాధానం చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లా హెచ్చరించారు. వైమానిక దాడుల ముప్పుతో సహా దేన్నైనా ఎదుర్కొనేందుకు తాము అప్రమత్తంగా వున్నామని ఇరాన్‌ పదాతిదళ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ కియొమార్స్‌ హేదరి పేర్కొన్నారు.
డ్రోన్ల దాడి తమ పనేనని ఇజ్రాయిల్‌ ఆర్మీ ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఇరాన్‌పై దాడి గురించి అమెరికాకు చివరి నిముషంలో సమాచారమిచ్చారని ఇటలీ విదేశాంగ మంత్రి తెలిపారు. కాగా ఈ దాడి నేపథ్యంలో పలు ఇరాన్‌ నగరాల్లో విమానాలను తాత్కాలికంగా నిలుపుచేశారు. సిరియా, ఇరాక్‌ల్లో పేలుళ్ళు సంభవించినట్లు కూడా వార్తలోచ్చాయి. గాజాలో ఇజ్రాయిల్‌ గత ఆరుమాసాలుగా కొనసాగిస్తున్న మారణహౌమం నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డమాస్కస్‌ నగరంలోని ఇరాన్‌ కాన్సులేట్‌ కార్యాలయంపై అమెరికా జరిపిన దాడిలో ఇరాన్‌ కమాండర్లు, దౌత్యవేత్తలతో సహా 13మంది మరణించారు. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌ల వర్షం కురిపించింది. ఆ దాడికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్‌ ప్రకటించింది.
అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ ప్రతీకార దాడుల చట్రాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ స్పష్టం చేశారు. అయితే ఇరాన్‌పై జరిగిన తాజా దాడిని ఆయన ప్రకటనలో ప్రస్తావించలేదు. ఎలాంటి ప్రతీకార చర్యలనైనా సరే ఖండించాల్సిందేనని అన్నారు. ఇటలీలోని కాప్రి దీవిలో జరుగుతున్న జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పశ్చిమాసియా ఉద్రికౖతలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ఎయిర్‌ ఇండియా విమానాల సస్పెన్షన్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన నేపథ్యంలో టెల్‌ అవీవ్‌కు విమానాల రాకపోకలను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. ఏప్రిల్‌ 30వరకు ఈ రద్దు నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. ఇప్పటికే టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నవారికి రీ షెడ్యూల్‌ చేయడానికి లేదా టిక్కెట్‌ రద్దు చేసుకోవడానికి ఒకసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది.

➡️