Jayant Sinha : నన్ను టార్గెట్ చేశారు – షోకాజ్‌ నోటీసులివ్వడంపై బిజెపి ఎంపీ

May 23,2024 16:44 #BJP MP, #Jayant Sinha, #Jharkhand

రాంచీ : జార్ఖండ్‌ బిజెపి తనకు షోకాజ్‌ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగించిందని బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి జయంత్‌సిన్హా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటుహక్కును వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని కారణాలు చూపుతూ.. జార్ఖండ్‌ బిజెపి ఆయనకు మే 20వ తేదీన షోకాజ్‌ నోటీసులు పంపింది. ఈ నోటీసులపై జయంత్‌సిన్హా తాజాగా స్పందించారు. ఈ నోటీసులపై ఆ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహుకు బుధవారం (మే 22) ఆయన లేఖ రాశారు. ‘వ్యక్తిగత కారణాల వల్ల నేను విదేశాలకు వెళ్లాను. నేను విదేశాల్లో ఉండడం వల్ల ఎన్నికల ప్రచారంలోనూ, ఓటింగ్‌లోనూ పాల్గొనలేకపోయాను. కానీ, నేను విదేశాలకు వెళ్లేముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా నా ఓటును వేసి పంపాను. అయితే నేను ఓటు వేయలేదని ఆరోపించడం తప్పు. ర్యాలీలు, పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత సమావేశాలకు జార్ఖండ్‌లో పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే ఏ ఒక్కరూ కూడా నన్ను సంప్రదించలేదు… ఆహ్వానించలేదు. అయినా, ఎన్నికలు ముగిసిన తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపడం ఏమిటో నాకు అర్థం కాలేదు. పార్టీకి నేను చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కూడా.. బహిరంగంగా నోటీసులు జారీచేయడం అనాలోచితంగా ఉంది. మీరు అనుసరించిన విధానం… అంకితభావం కలిగిన పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచేదిగా వుంది. ఈ తరహా విధానాలు పార్టీ సమిష్టి తత్వాన్ని బలహీనపరుస్తుంది. నన్ను అన్యాయంగా, అనవసరంగా టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తుంది’ అని జయంత్‌సిన్హా తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ సామాజికమాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు.

కాగా, జయంత్‌సిన్హా నియోజకవర్గమైన హజారీబాగ్‌ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో మనీష్‌ జైశ్వాల్‌ని బిజెపి బరిలోకి దింపింది. ఈ విషయంపై పార్టీ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని, జైశ్వాల్‌కి పూర్తిగా తన మద్దుతు ఉంటుందని సిన్హా తెలిపారు. జైశ్వాల్‌ తన నామినేషన్‌ ర్యాలీలో పాల్గొనమని కాల్‌ చేశారు. అయితే చివరి నిమిషంలో ఆహ్వానం అందడం వల్ల తాను హాజరుకాలేకపోయానని సిన్హా తన లేఖలో పేర్కొన్నారు. అయితే మరుసటిరోజు జైశ్వాల్‌ ఇంటికివెళ్లి శుభాకాంక్షలు తెలిపానని సిన్హా తన లేఖలో పేర్కొన్నారు. అయితే మనీష్‌ జైశ్వాల్‌ను హజారీబాగ్‌ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని, మనీష్‌కి మద్దతు ఇవ్వలేదని, దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని…జయంత్‌సిన్హా కు షోకాజ్‌ నోటీసులు పంపడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మార్చి 2వ తేదీన జయంత్‌సిన్హా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులపై తాను దృష్టి పెడుతున్నానని, అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని, అవసరాన్నిబట్టి ఆర్థిక, పాలనాపరమైన సమస్యల్లో పార్టీతో కలిసి పనిచేస్తాను’ అని ఆయన ప్రకటించారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆయన ప్రకటన తర్వాత మార్చి 8వ తేదీన హజారీబాగ్‌ స్థానానికి జయంత్‌సిన్హాకు బదులు మనీష్‌ జైశ్వాల్‌ని బిజెపి ఎంపిక చేయడం గమనార్హం.

➡️