కవిత బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

Jul 2,2024 00:42 #bail petition, #canceled, #Kavitha

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిల్‌ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న కవితను ఇడి అధికారులు అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 11న సిబిఐ విచారణ కోసం రెండు రోజులు కస్టడిలోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. సిబిఐ, ఇడి కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ.. ఇడి, సిబిఐ వాదనలను పరిగణనలోకి తీసుకుని కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చింది.

➡️