చట్ట ప్రకారం నడుచుకుంటా : కేజ్రీవాల్‌

Jan 18,2024 12:10 #Arvind Kejriwal, #ED summons

న్యూఢిల్లీ :    తాను చట్ట ప్రకారం నడుచుకుంటానని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.  పరోక్షంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి ) సమన్లనుద్దేశించి కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  లిక్కర్‌ పాలసీ కేసులో గురువారం   విచారణకు హాజరు కావాల్సిందిగా  ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఈడి విచారణకు ఆయన హాజరుకావడం లేదని,   లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు గురువారం గోవాకు వెళుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.    గురువారం కూడా  ఢిల్లీలో విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్‌ హాజరుకానున్నారని, పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో పాల్గొననున్నారని  ఆ వర్గాలు పేర్కొన్నాయి.  గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపాయి.

బుధవారం మధ్యాహ్నం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. తాను చట్టరిత్యా అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.   వరుసగా నాలుగోసారి కేజ్రీవాల్  ఈడి విచారణకు గైర్హాజరు కావడం గమనార్హం.

ఈ నోటీసులు చట్టవిరుద్ధమని.. రాజకీయ ప్రేరేపితమని  గతంలో కేజ్రీవాల్   పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా  అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం ఈ విధంగా సమన్లు జారీ చేయిస్తోందని మండిపడ్డారు. ఈ సమన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గతేడాది నవంబర్‌ 2న ఈడి మొదటిసారిగా కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.  డిసెంబర్‌ 21న రెండో సారి, జనవరి 3న మూడోసారి ఈడి సమన్లను దాటవేశారు.

➡️