స్వాతి మాలివాల్‌పై కేజ్రీవాల్‌ పిసి అసభ్య ప్రవర్తన

  •  కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆప్‌ నేత

న్యూఢిల్లీ : ఆప్‌ రాజ్యసభ ఎంపి స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌కుమార్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. సోమవారం సిఎం అధికారిక నివాసంలో కేజ్రీవాల్‌ను స్వాతి మాలివాల్‌ కలవడానికి వెళ్లి సందర్భంలో ఈ ఘటన జరిగింది. డ్రాయింగ్‌ రూమ్‌లో స్వాతి మాలివాల్‌ వేచివుండగా, వైభవ్‌ కుమార్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆప్‌ నాయకులు సంజరు సింగ్‌ తెలిపారు. ఈ ఘటన ఖండించదగినదని, కేజ్రీవాల్‌ కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ విషయంపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన స్వాతి మాలివాల్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడి చేశారని అక్కడ అధికారులకు తెలిపారు. పోలీసులకు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
ఈ అంశంపై ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసిడి) మంగళవారం సమావేశంలో గందరగోళం చెలరేగింది. మంగళవారం సమావేశం ప్రారంభమైన వెంటనే బిజెపి, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వెల్‌లోకి దూసుకెళ్లి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో మేయర్‌ సభను వాయిదా వేశారు.

➡️