జూన్‌ 1 వరకూ కేజ్రీవాల్‌కు బెయిల్‌

May 11,2024 08:13 #interim bail, #Kejriwal, #Supreme Court

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గొప్ప ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరంలో కీలకంగా ఉన్న ఆమాద్మీ పార్టీ అధినేత అయిన కేజ్రీవాల్‌ను ఎన్నికలకు దూరంగా ఉంచితే ఆ మేరకు ప్రభావం తగ్గించవచ్చునని కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి ఆయనను అరెస్టు చేయించి కుయుక్తులకు తెరలేపిన బిజెపి ప్రభుత్వానికి ఈ తీర్పుతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు వీలు కల్పిస్తూ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ వర్తిస్తుందని, అదే నెల 2న తిరిగి లంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది.
ఢిల్లీ సిఎంకు మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు వ్యతిరేకించారు. ఖలిస్తానీ కార్యకలాపాలపై జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించబడిన అమృత్‌ పాల్‌ సింగ్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడం తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్‌జి పేర్కొన్నారు. దీనికి స్పందించిన జస్టిస్‌ ఖన్నా ”అది ( అమృత్‌ పాల్‌ సిగ్‌ కేసు) భిన్నమైనది” అని అన్నారు. అభ్యర్థి కానప్పుడు ప్రచారానికి ఒక వ్యక్తిని విడుదల చేసినందుకు ఎటువంటి పూర్వాపరాలు లేవని ఎస్‌జి అన్నారు. దీనిపై జస్టిస్‌ ఖన్నా ”మేము జూన్‌ 1 వరకు ఆయనకి మధ్యంతర ఉపశమనం ఇస్తూ ఆర్డర్‌ను పాస్‌ చేస్తున్నాము. సాయంత్రంలోగా ఆర్డర్‌ను అప్‌లోడ్‌ చేస్తాము” అని జస్టిస్‌ ఖన్నా చెప్పారు. ఇడి అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తుది వాదనలు వచ్చే వారంలో ముగిసే ప్రయత్నం చేస్తామని జస్టిస్‌ ఖన్నా పేర్కొన్నారు.
అయితే, లిక్కర్‌ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ మాట్లాడొద్దని ఇడి తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. మీరు కూడా అంతకంటే గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలని సూచించింది. 21 రోజులు కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు జూన్‌ 4 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జూన్‌ 2న తిరిగి లంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన తరువాత మార్చి 21న కేజ్రీవాల్‌ ను ఇడి అరెస్టు చేసింది. మే 3న విచారణ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం మొగ్గు చూపింది. అయితే, తాము ఎన్నికైన ముఖ్యమంత్రి కేసును పరిశీలిస్తున్నామని, సాధారణ నేరస్తుడి కాదని, సాధారణ ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతాయని ధర్మాసనం పేర్కొంది. మే 7న విచారణ సందర్భంగా, నిజంగానే మధ్యంతర విడుదలను ఆదేశించినట్లయితే, కేజ్రీవాల్‌ అధికారిక విధులను నిర్వహించడానికి అనుమతించరాదని ధర్మాసనం మౌఖికంగా సూచించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇడి గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.
కేజ్రివాల్‌కు బెయిల్‌ను స్వాగతించిన సిపిఎం
కేజ్రివాల్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయడాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో స్వాగతించింది. ఇలా బెయిల్‌ను ఇవ్వడం ద్వారా, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గనకుండా కేజ్రివాల్‌ను అడ్డుకోవాలన్న ప్రయత్నాన్ని కోర్టు భగం చేసిందని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. కేజ్రివాల్‌ అరెస్టు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, మోడీ ప్రభుత్వం పన్నిన నీచపుటెత్తుగడలు ఈ తీర్పుతో ఎండగట్టినట్లైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

➡️