మరో 7 రోజులు బెయిల్‌ పొడిగించండి

  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్‌ తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజులు పొడిగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే పొడిగించాలని అన్నారు. తనను అరెస్టు చేసిన తరువాత బరువు ఏడు కిలోలు తగ్గానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే తాను పిఇటి-సిటి స్కాన్‌ సహా పలు పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో టెస్టులు చేయించుకోవడానికి మరో ఏడు రోజులు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు.
అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ లిక్కర్‌ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. సుప్రీంకోర్టు జూన్‌ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న కేజ్రీవాల్‌ లొంగిపోవాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఇడి అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో తీహార్‌ జైలులో ఉన్నారు. దాదాపు 51 రోజుల తరువాత కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజులు మాత్రమే రిలీఫ్‌ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22కు సంబంధించిన లిక్కర్‌ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్‌ జరిగిందని ఈ కేసులో ఆరోపణలున్నాయి.

➡️