రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను పంపడంపై మార్గదర్శకాలు కోరిన కేరళ

Dec 29,2023 16:19 #Governor, #kerala, #Supreme Court

న్యూఢిల్లీ :    రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్‌ బిల్లులను రిజర్వ్‌ చేయగల పరిస్థితులపై మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేరళ సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌కు చేసిన సవరణ ద్వారా రాష్ట్రం ఇటీవల ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.   గవర్నర్‌ ఏఏ పరిస్థితులలో బిల్లులను రిజర్వ్‌ చేయవచ్చు అనే అంశంపై సరైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరింది.   రాజ్యాంగంలోని 200వ అధికరణంలోని మొదటి నిబంధనలో ఉన్న సాధ్యమైనంత త్వరగా అనే పదబంధాన్ని గవర్నర్‌కు సమర్పించిన బిల్లుల పరిష్కారానికి వర్తించే టైమ్‌లైన్‌ అంశంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కేరళ కోరింది.    పెండింగ్‌లో ఉన్న బిల్లులను మరింత ఆలస్యం చేయకుండా పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కూడా కోరింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం అధికారాన్ని వినియోగించకుండా గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో ఉంచడం వల్ల అనేక రాష్ట్రాలు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయని కేరళ హైలెట్‌ చేసింది. క్రిస్మస్‌ సెలవుల అనంతరం సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమైనపుడు ఈ కేసును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

➡️