ముస్లింలకు మాత్రమే పిల్లలుంటారా..? :  మోడీని ప్రశ్నించిన ఖర్గే

May 1,2024 00:23 #BJP, #coments, #Kharge, #modi

రాయ్ పూర్‌ : ముస్లింలకు మాత్రమే పిల్లలు ఉంటారా..? అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. ముస్లింలపై ప్రధాని మోడీ చేస్తున్న ‘అధిక సంతానం’, ‘చొరబాటుదారులు’ వంటి ఆరోపణలను ఖర్గే తిప్పికొట్టారు. ‘మేం మెజార్టీ దిశగా వెళుతున్నాం. ఈ కారణం చేతనే మోడీ మంగళసూత్రాలు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. మేం (కాంగ్రెస్‌) మీ సొమ్మును దొంగిలించి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి (ముస్లింలకు) ఇచ్చేస్తామని మోడీ ఆరోపిస్తున్నారు. పేదలకు ఎక్కువ మంది పిల్లలుంటారు. ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలు ఉంటారా? నాకు ఐదుగురు పిల్లలు’ అని ఖర్గే చెప్పారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్గిర్‌-చంపా జిల్లాలో ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘మోడీ ముస్లింలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? వారు కూడా ఈ దేశంలో భాగమే. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయవద్దు’ అని ఖర్గే చెప్పారు. 55 ఏళ్ల పాటు దేశాన్ని కాంగ్రెస్‌ పరిపాలించిందని, ఏ ఒక్కరి మంగళసూత్రాన్ని దోచుకోలేదని ఖర్గే గుర్తు చేశారు. ‘మేం బలవంతంగా పన్నులు వసూలు చేయలేదు. ప్రజల్ని జైల్లో పెట్టడానికి ఇడి, సిబిఐలను దుర్వినియోగం చేయలేదు. ఎంతో ధైర్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత చట్టం కూడా తెచ్చాం. బిజెపి ఇలాంటివి ఏమైనా చేసిందా?’ అని ఖర్గే ప్రశ్నించారు.
మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, రాజీవ్‌గాంధీలతో మోడీని పోల్చలేమని ఖర్గే అన్నారు. ‘వారు దేశానికి ఉక్కు ఫ్యాక్టరీలు, బొగ్గు గనులు, డ్యామ్‌లు, ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చారు. మోడీ ఏమీ చేశారు.. జస్ట్‌ జుమ్లాస్‌’ అని ఖర్గే విమర్శించారు.

➡️