బిజెపి రాజకీయ ఆయుధంగా ఇడి : ఢిల్లీ మంత్రి అతిషి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసిన ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించి, ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఇడి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ”కేజ్రీవాల్‌ ఫోన్‌ని పరిశీలించాలని ఇడి పట్టుబడుతోంది. నిజానికి.. ఎక్సైజ్‌ పాలసీని రూపొందించి, అమలు చేసినప్పుడు ఆ మొబైల్‌ ఫోన్‌ ఉనికిలోనే లేదు. ఇది కొన్ని నెలల క్రితం నాటిది మాత్రమే. అయినా ఆ ఫోన్‌ కావాలని ఇడి పట్టుబట్టడాన్ని చూస్తుంటే.. ఆ ఏజెన్సీ బిజెపి రాజకీయ ఆయుధంగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది” అని అన్నారు. నిజానికి.. ఆ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటోంది బిజెపి అని, ఇడి కాదని తెలిపారు. ఎక్సైజ్‌ పాలసీని అమలు చేసినప్పుడు కేజ్రీవాల్‌ వద్ద ఉండే ఫోన్‌ ఇప్పుడు అందుబాటులో లేదని స్వయంగా ఇడి చెప్పిందని, అయితే ఇప్పుడు కొత్త ఫోన్‌ పాస్‌వర్డ్‌ కావాలని ఆ ఏజెన్సీ కోరుతోందని చెప్పారు. పాస్‌వర్డ్‌ ఇవ్వకపోవడం వల్ల.. మరికొన్ని రోజులు కస్టడీ అవసరమని ఇడి న్యాయవాది కోర్టులో చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఇడి పాస్‌వర్డ్‌ అడగడం లేదని, కేజ్రీవాల్‌ ఫోన్‌లో ఏముందో తెలుసుకునేందుకు బిజెపి చేస్తున్న కుట్ర అని అతిషి ఆరోపించారు. ఆప్‌ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, ఇండియా ఫోరం నాయకులతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్‌ మీడియా వ్యూహాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, అస్సాంలలో మొత్తం 22 లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన ఆప్‌ వ్యూహాన్ని బిజెపి తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.

ఇడి ముందుకు ఢిల్లీ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు తరువాత కూడా ఇడి ‘ఆప్‌’ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత కైలాష్‌ గెహ్లాట్‌ శనివారం ఇడి ముందు విచారణకు హాజరయ్యారు. నజఫ్‌గఢ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గెహ్లాట్‌ (49) కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో రవాణా, హోం, న్యాయ శాఖల మంత్రిగా ఉన్నారు. పిఎంఎల్‌ఎ కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఇడి సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టు తరువాత ఆయనకు ఈ సమన్లు వచ్చాయి.

కేజ్రీవాల్‌ సతీమణి సునీతను కలిసిన హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన
జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు, ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆదివారం జరిగే ఇండియా ఫోరం మెగా ర్యాలీకి కూడా కల్పనా సోరెన్‌ హాజరుకానున్నారు. సునీతను కలిసిన అనంతరం కల్పన మాట్లాడుతూ.. ”కొన్ని నెలల క్రితం జార్ఖండ్‌లో ఏం జరిగిందో అదే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతోంది. నా భర్త హేమంత్‌ సోరెన్‌ని జైలుకు పంపారు. ఇప్పుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ని అరెస్టు చేశారు. అందుకే మా బాధను పంచుకోవడానికి సునీతని కలవడానికి వచ్చాను. ఇకపై మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము చర్చించుకున్నాం. ఆమె మాకు మద్దతు ఇస్తుందని, అరవింద్‌ కేజ్రీవాల్‌కు జార్ఖండ్‌ మద్దతు ఇస్తుంది” అని కల్పన అన్నారు.

➡️