జమ్మూకాశ్మీర్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు

న్యూఢిల్లీ :    జమ్మూకాశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్మూకాశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలు, లడఖ్‌లో ఒక ఎంపి స్థానం ఉన్నాయి. జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు సిఇసి రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు.  ఏప్రిల్‌ 19, ఏప్రిల్‌ 26, మే 7, మే 13, మే 20న పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

➡️