ఇప్పటికీ జైల్లో ఉన్నట్లే అనిపిస్తోంది ! : నిర్బంధంపై ప్రొఫెసర్‌ సాయిబాబా

Mar 9,2024 10:28 #Constraint, #Jail, #Professor Saibaba

న్యూఢిల్లీ : నిర్దోషిగా విడుదలైన తాను ఇంకా జైలు గదిలోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలు న్నాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు ఈ నెల 5న సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించగా..ఆయన ఈ నెల 7న నాగపూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆసుపత్రికి వెళ్లాల్సివుందనని, కానీ ఆ లోపే మీడియాతో మాట్లాడి తన ఆవేధనను పంచుకోవాలని నిర్ణయించుకొని ఈ సమాశం ఏర్పాటు చేశామన్నారు. జైలులో తన ఏడేళ్ల కష్టాలను సాయిబాబా గుర్తు చేసుకున్నారు. అలాగే తన కుటుంబం అనుభవించిన కష్టాలపైనా మాట్లాడుతూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ‘నాపై తీవ్రవాద ముద్రవేశారు. నా కుటుంబాన్ని ఇబ్బందుల పాల్జేశారు’ అని భావోద్వేగంతో ఏడేశ్చారు. ‘నేను స్వేచ్ఛగా ఉన్నానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అపఖ్యాతి పాలైన నేను ఇప్పటికీ జైలు గదిలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది నాకు అగ్ని పరీక్ష వంటిది. రెండుసార్లు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నా’ అని ఆయన అన్నారు. ఈ కేసులో తన తరుపున పోరాడిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులు ఏమీ ఆశించకుండా న్యాయాన్ని గెలిపించడానికి కృషి చేశారని కొనియాడారు. ఈ పోరాటంలో తనకు మద్దతు ఇచ్చినందుకు ఒక న్యాయవాది జైలుకు కూడా వెళ్లారని సాయిబాబు తెలిపారు. మరికొందరు పోలీసుల నుంచి బెదిరింపులను కూడా ఎదుర్కొవాల్సివచ్చిందన్నారు.

➡️