Manipur police : ఇద్దరు కుకీల మృతిపై జీరో ఎఫ్‌ఐఆర్‌

Apr 15,2024 11:45 #Kuki, #Manipur police, #Zero FIRs

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. కాంగ్‌పోక్సీ జిల్లా సరిహద్దుల్లో శనివారం ఉదయం మొయితీలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కుకీ వాలంటీర్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను చిధ్రం చేసినట్లు కుకీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇద్దరు కుకీ వాలంటర్లీ మృతిపై కాంగ్‌పోక్సీ పోలీస్‌ స్టేషన్‌లో రెండు జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మణిపూర్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం సెక్షన్‌ 16, ఎస్‌సి,ఎస్‌టి (అత్యాచార నిరోధక ) చట్టం సెక్షన్‌ 3, ఐపిసిలోని హత్య, నేరపూరిత కుట్ర, అల్లర్లు, బెదిరింపులు, సంబంధిత నేరాలు, ఆయధ చట్టంలోని సెక్షన్ల కింద నమోదు చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మృతులను కాంగ్‌పోక్సీ జిల్లాలోని కె. సాజాగ్‌ గ్రామానికి చెందిన కమ్మిన్‌లాల్‌ లుఫెంగ్‌ (23), బాంగ్‌జాంగ్‌ గ్రామానికి చెందిన కామ్లెన్‌సాత్‌ లుంకిమ్‌ (25)లుగా గుర్తించారు. వారి  మృతిపై ఆరంబై తెంగోల్ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మణిపూర్‌ ట్రైబల్స్‌ ఫోరమ్‌ – ఢిల్లీ  లేఖ

మణిపూర్‌ అల్లర్లపై దత్తా పదస్లాగికర్‌ డిజిపి (రిటైర్డ్‌) నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీకి మణిపూర్‌ ట్రైబల్స్‌ ఫోరమ్‌ ఢిల్లీ (ఎంటిఎఫ్‌డి) లేఖ రాసింది.  లుఫెంగ్‌, లుంకిమ్‌లను  అత్యంత క్రూరంగా వారి పాదాలను తాళ్లతో కట్టి కొండపైకి లాగారని, హత్య చేసిన తర్వాత  మృతదేహాలను కొడవలితో ముక్కలుగా నరికి ఊరేగించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయాని పేర్కొన్నారు.  గతేడాది మే 3లో అల్లర్లు ప్రారంభమైనప్పటి  నుండి తమ కమ్యూనిటీని రక్షించమని పోలీసులు, న్యాయవ్యవస్థను వేడుకుంటున్నామని, అయితే తమ ప్రాణాల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ప్రారంభం కానున్న సమయంలో ఓటింగ్‌లో పాల్గొంటే  తమ ప్రాణాలకు ముప్పు అని ఈ హత్యలు హెచ్చరిస్తున్నాయని తెలిపారు.

కాగా, మణిపూర్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19, ఏప్రిల్‌ 26 రెండు దశల్లో జరగనున్నాయి. కుకీ జిల్లాలైన చురాచంద్‌పూర్‌, కాంగ్‌పోక్సీలను మొదటి దశకు షెడ్యూల్‌ చేయగా, ఔటర్‌ మణిపూర్‌ రెండవ దశలో పోలింగ్‌లో పాల్గననుంది.

➡️