విద్యార్థుల అరెస్ట్‌ను ఖండించిన మెహబూబా ముఫ్తీ

Nov 28,2023 14:37 #Jammu and Kashmir, #Mehbooba Mufti

 శ్రీనగర్‌   :   ఏడుగురు కాశ్మీర్‌ విద్యార్థుల అరెస్టును పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) చీఫ్‌, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తీ మంగళవారం ఖండించారు. జమ్ముకాశ్మీర్‌ విద్యార్థుల అరెస్ట్‌ దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసిందని అన్నారు. ఈ అంశంపై జమ్ముకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జోక్యం చేసుకోవాలని ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.

” కాశ్మీర్‌లో గెలిచిన క్రికెట్‌ టీమ్‌ను అభినందించడం కూడా నేరంగా పరిగణించబడటం దిగ్భ్రాంతి, ఆందోళనకు గురిచేస్తోంది. జర్నలిస్టులు, కార్యకర్తలు, ఇప్పుడు విద్యార్థులపై యుఎపిఎ వంటి క్రూరమైన ట్టాలను ప్రయోగించడం సాధారణంగా మారింది. ఈ చర్యతో జమ్ముకాశ్మీర్‌ యువతపై కేంద్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైంది. ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను తుపాకులతో అడ్డుకుంటున్నారు” అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు.

షేర్‌-ఇ-కాశ్మీర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌కెయుఎఎస్‌టి)కి చెందిన ఏడుగురు కాశ్మీర్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా ఓటమి పాలవడంతో అభ్యంతరకరమైన నినాదాలతో తనను వేధించారంటూ అదే కాలేజీకి చెందిన పంజాబ్‌ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ విద్యార్థులపై క్రూరమైన యుఎపిఎ చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం.

➡️