ఇసి నోటీసుల లీక్‌పై మంత్రి అతిషీ ఆగ్రహం

  •  ఇ-మెయిల్‌ రాకమునుపే షేర్‌ చేసిన బిజెపి

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు మీడియాలో వైరల్‌ అవ్వడంపై ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత అతిషి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇసి తనకు ఇ మెయిల్‌ ద్వారా నోటీసులు పంపడానికి గంట ముందే ఈ నోటీసులను బిజెపి మీడియాలో లీక్‌ చేసిందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ సంస్థనా లేకపోతే బిజెపి అనుబంధ సంస్థనా అని నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అభ్యంతరకర హోర్డింగులు, పోస్టర్లపై తమ పార్టీ ఇసికి అనేక సార్లు లేఖలు రాసిందని, కానీ బిజెపిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన, కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థలకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఈ నోటీసులకు తాను సమధానిస్తానని అన్నారు. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిపించేందుకు ఇసి తటస్థంగా, పక్షపాతరహితంగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీలో చేరకుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దాడులు తప్పవని, అరెస్టులు కూడా ఉంటాయని బిజెపి నేతలు తమను బెదిరించారని మంగళవారం అతిషి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇసి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

➡️