దళిత యువకుడు, ముస్లిం యువతిపై కర్ణాటకలో మూకదాడి 

Jan 8,2024 11:45 #Attacks On Dalit, #Karnataka
attack on dalit in karnataka

 

తొమ్మిదిమంది అరెస్టు

బెంగళూరు : బహిరంగ ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుంటున్న దళిత యువకుడు, ముస్లిం యువతిపై దాడి చేసి, వారిని నిర్బంధించి ప్లాస్టిక్‌ పైపులు, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. కర్ణాటకలోని బెళగావిలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సిఎం యువ నిధి పథకానికి దరకాస్తు చేసేందుకు 18 ఏళ్ల దళిత యువకుడు సచిన్‌ లమాని, 22 ఏళ్ల ముస్లిం యువతి ముస్కాన్‌ పటేల్‌ శనివారం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. భోజన విరామ సమయం కావడంతో ఆ తర్వాత రావాలని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో వారిద్దరూ బెళగావిలోని కిల్లా సరస్సు వద్దకు చేరుకుని అక్కడ కూర్చొన్నారు. కొందరు ఆకతాయిలు సచిన్‌, ముస్కాన్‌ వద్దకు వచ్చి, మీరెవరంటూ ప్రశ్నించారు. ఆ మహిళ తన బంధువని సచిన్‌ చెప్పగా, ఇద్దరి పేర్లు అడిగారు. ముస్లిం మహిళతో కలిసి ఎందుకు ఉన్నావంటూ సచిన్‌ను ప్రశ్నించి వేధించారు. ఇంతలో మరో 13 మంది అక్కడకు చేరుకున్నారు. వారిద్దరిని అక్కడి నుంచి తీసుకెళ్లి గదిలో నిర్బంధించారు. తిట్టడంతోపాటు ప్లాస్టిక్‌ పైపులు, ఐరన్‌ రాడ్లతో సచిన్‌ను కొట్టారు. అతడి గొంతు నొక్కారు. ముస్కాన్‌పై కూడా దాడి చేశారు. బలవంతంగా మొబైల్‌ ఫోన్స్‌, వారి వద్ద ఉన్న రూ.7,000 నగదు లాక్కున్నారు. శనివారం సాయంత్రం వరకు వారిద్దరిని వేధించారు. ఆ తర్వాత బెదిరించి వారిని విడిచిపెట్టారు. అనంతరం బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తొమ్మిది మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

➡️