రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా చూస్తున్న మోడీ

Feb 9,2024 10:18 #MK Stalin

కేంద్రంపై నిప్పులు చెరిగిన స్టాలిన్‌ శ్రీ కేరళ నిరసనోద్యమానికి సంఘీభావం చెన్నై : దేశంలో రాష్ట్రాలు వుండడం లేదా ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వుండడం ప్రధాని నరేంద్ర మోడీకి నచ్చడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ గురువారం వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నానుద్దేశించి స్టాలిన్‌ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. స్పెయిన్‌ పర్యటనకు వెళ్లి ఇప్పుడు వచ్చినందున కేరళ నిరసనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నానని, డిఎంకె ఎంపీలు స్వయంగా వెళ్లి పాల్గొన్నారని స్టాలిన్‌ తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రి పనరయి, ఆయన మంత్రివర్గం చేపట్టిన పోరటానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. రాష్ట్రాలను, రాష్ట్ర ప్రజలను గౌరవించిన గత ప్రధానుల్లా కాకుండా మోడీ రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవానికి మోడీ ప్రధాని కాకముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్నారని, కానీ ఆయన ప్రధాని పదవి చేపట్టిన తర్వాత చేసిన మొదటి పని రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడమేనని విమర్శించారు. విద్యా హక్కులను, భాషా హక్కులను, చట్టపరమైన హక్కులను ఇలా అన్నింటినీ లాక్కుంటున్నారని అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా రాష్ట్రాల హక్కులను లాక్కుంటున్నారని, ఇదెలా వుందంటే ఒక మనిషికి ఆక్సిజన్‌ను నిలిపివేయడంలా వుందని,. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి చేస్తోందదేనని స్టాలిన్‌ విమర్శించారు. జిఎస్‌టి వ్యవస్థను విధించినప్పటి నుండి అన్ని రాష్ట్రాలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయన్నారు. ఆ సంక్షోభాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కానీ అలా జరగడం లేదన్నారు. అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు రుణాలు తీసుకోకుండా రాష్ట్రాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. తమ రోజువారీ అవసరాలను రాష్ట్ర ప్రభుత్వాలు తీరుస్తాయని ప్రజలు భావిస్తారని, కానీ అలా జరగకుండా కేంద్రం అడ్డుపడుతోందన్నారు. ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తూ రాష్ట్రాలన్నీ ఒక్క తాటిపైకి రావాలని ఆయన కోరారు. ఈ ఫాసిస్ట్‌ బిజెపిని నిలువరించి, అన్ని రాష్ట్రాలను సమానంగా గౌరవించే భారతదేశాన్ని మనం సృష్టించాలన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆయన హెచ్చరించారు. ఈ రోజు ప్రతిపక్షాల పాలనలో వున్న రాష్ట్రాల పరిస్థితులే రేపు మీకు కూడా ఎదురు కావచ్చని ఆయన హెచ్చరించారు.

➡️