ఢిల్లీ సరిహద్దులో ఉద్యమ జ్యోతులు

Feb 25,2024 08:25 #Delhi, #formers, #nirasana

– కేంద్రం తీరుపై అన్నదాతల ధర్మాగ్రహం

– శంభూ, ఖనౌరీ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ

– కొనసాగుతున్న ఇంటర్నెట్‌ ఆంక్షలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై కర్షకలోకం శనివారం కూడా వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసనాగ్రహాన్ని వ్యక్తం చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం తీసుకురావాలని, ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో మలి విడత పోరు సాగిస్తున్న రైతులు..శంభూ, ఖనౌరీ ప్రాంతాల్లోని ఉద్యమ శిబిరాల వద్ద కొవ్వొత్తులు వెలిగించారు. తమ డిమాండ్లన్నిటిని నెరవేర్చేదాకా ఈ ఉద్యమ జ్యోతులు వెలుగులీనుతూనేవుంటాయని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కూడా వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. వ్యవసాయ రంగ కార్పొరేటీకరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) మంత్రుల స్థాయి సదస్సులో దీనిని గట్టిగా వ్యతిరేకించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. డబ్ల్యుటిఒ చర్యను, దానికి వంతపాడుతున్న దేశాల మంత్రుల దిష్టిబమ్మలను ఆదివారం ఉద్యమ శిబిరాల వద్ద దగ్ధం చేయాలని నిర్ణయించాయి.

కొనసాగుతున్న ఇంటర్నెట్‌ ఆంక్షలు

రైతు ఆందోళన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్‌, జింద్‌, హిస్సార్‌, ఫతేహాబాద్‌, సిర్సా తదితర ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌, బల్క మెసేజ్‌లపై నిషేధం విధించారు. ఈ నెల 11న విధించిన నిషేధం, ఇప్పటి వరకు ఏడు సార్లు పొడిగించారు. రైతులు చేస్తున్న ఢిల్లీ చలో మార్చ్‌ను ఈ నెల 29కి వాయిదా వేసుకున్న నేపథ్యంలో అప్పటి వరకు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోనే మకాం వేయాలని ఉమ్మడి కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ చలోకు సంబంధించి తదుపరి కార్యాచరణను 29న నిర్ణయించనున్నారు. అప్పటి వరకు పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీలోని నిరసన కేంద్రాల వద్ద రైతులు బైఠాయించనున్నారు.హర్యానా పోలీసులపై చర్యలు తీసుకోనిదే యువరైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌ మృతదేహాన్ని స్కీవరించబోమని రైతు సంఘాలు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మూడు రోజులుగా శుభ్‌ కరణ్‌ మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆయన కుటుంబం తిరస్కరించిన సంగతి విదితమే.

➡️