రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడి హత్య కేసు.. నిందితుల అరెస్టు 

Dec 10,2023 12:14 #Rajasthan, #Rajput Leader

 న్యూఢిల్లీ :   రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి   హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం  అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్‌ హత్య కేసులో నిందితుల కోసం ఢిల్లీ, రాజస్థాన్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. నిందితుల గురించి సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా   రోహిత్‌ రాథోడ్‌, నితిన్‌ ఫౌజీ అనే ఇద్దరు నిందితులను చండీగఢ్‌లో అరెస్టు చేశారు. వీరితో పాటు మరో వ్యక్తి ఉద్ధమ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి ఈ నెల 5న పట్టపగలు  హత్యకు గురైన సంగతి తెలిసిందే.   ముగ్గురు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం జైపూర్‌లోని సుఖ్‌దేవ్‌ నివాసానికి వెళ్లారు. సుఖ్‌దేవ్‌తో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని లోపలకు తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత  కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ సహచరుల కాల్పుల్లో మరణించాడు. సుఖ్‌దేవ్‌ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్‌ బిష్ణోయ్  ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్‌ గోదారా గ్యాంగ్‌ ప్రకటించుకుంది. సుఖ్‌దేవ్‌ మృతిని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

➡️