ఓటమి తప్పదనే నితీష్‌కు మతి భ్రమించింది !

Apr 22,2024 00:43 #coments, #Lalu Prasad Yadav
  •  ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వ్యహార శైలి మతిస్థిమితంలేని వ్యక్తి చేష్టల్లా ఉందని ఆర్‌జెడి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శించారు. బిజెపి నాయకులు తమ ప్రచార సభలకు కూడా నితీష్‌ను రానివ్వడం లేదంటే ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చునని లాలూ అన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సరన్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన రెండో కుమార్తె రోహిణి అచార్య తరుపున మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించిన లాలూ ప్రసాద్‌ ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇతర పార్టీలు, మహాఘట్బంధన్‌ అభ్యర్థులు తరపున కూడా ప్రచారం చేస్తానన్నారు. ఈ నెల 20న ఎన్నికల ప్రచార సభలో నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘లాలూకు పని ఏమీ లేదు. పిల్లలను కనడం తప్ప’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అడిగిన ప్రశ్నకు లాలూ స్పందిస్తూ ‘నితీష్‌కుమార్‌కు మతి భ్రమించింది. అందుకే ఆయనను బిజెపి కూడా ప్రచారానికి తీసుకెళ్లడం లేదు’ అని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదనే నైరాశ్యంలో నితీష్‌ ఉన్నారని, అందుకే ఇలాంటి అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని లాలూ అన్నారు. ఈ ఎన్నికల్లో బీహార్‌లో బిజెపి తుడుచుపెట్టుకుపోతుందన్నారు. బీహార్‌లోని ఆర్‌జెడి నేతృత్వంలోని మహాఘట్బంధన్‌ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే ప్రశ్నకు ‘అన్నీ స్థానాలను మేం గెలుచుకుంటాం. బిజెపి తుడుచుపెట్టుకుపొతుంది’ అని లాలూ అన్నారు. సరన్‌ స్థానం నుంచి 1977, 1989ల్లో లాలూ ప్రసాద్‌ లోక్‌సభ ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన కుమార్తె రోహిణి పోటీ చేస్తున్నారు. బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ఔరంగాబాద్‌, నవాడా, గయ, జముయి స్థానాల్లోకు ఎన్నికలు జరగ్గా 48.23 శాతం పోలింగ్‌ నమోదైంది.

➡️