ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్న నితీష్ కుమార్ : జైరాం రమేష్

Jan 28,2024 12:40 #INDIA bloc, #Nitish Kumar

పాట్నా :   తరుచూ పార్టీలు మారుతూ  జెడియు అధ్యక్షుడు నితీష్ కుమార్   ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్   వ్యాఖ్యానించారు.  బీహార్‌ ప్రజల విశ్వాసాలను  ఆయన విస్మరిస్తున్నారని, ప్రజలు ఆయనను  క్షమించరని అన్నారు.   నీతీష్  లాంటి ‘ఆయా రామ్‌.. గయా రామ్‌’  మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని  కాంగ్రెస్‌ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే ఎద్దేవా  చేశారు. నీతీష్  రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని,  ఈ విషయాన్ని తమకు  ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ యాదవ్,  తేజస్వీ యాదవ్‌ ముందే చెప్పారని అన్నారు.   ఇండియా ఫోరం  సమైక్యతను  దృష్టిలో  ఉంచుకొని తాము ముందే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

అందుకే  మహా కూటమి నుండి  బయటికి వచ్చా : నితీష్ కుమార్ 

కాంగ్రెస్, ఆర్‌జెడితో కూడిన మహా కూటమిలో పరిస్థితులు సరిగా లేవని, అందుకే కూటమి నుండి బయటికి వచ్చానని జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని అన్నారు. ఆదివారం గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహాకూటమి  సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని అన్నారు. గతంలో ఉన్న ఎన్‌డిఎ కూటమితో వెళ్లాలని భావించామని, అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండున్నరేళ్ల  కాంగ్రెస్, ఆర్‌జెడి, జెడియు కూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బిజెపి-జెడియు నేతృత్వంలో నితీష్‌ కుమార్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే బిజెపి, జెడియు పార్టీలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

➡️