15, 16 తేదీల్లో నోటిఫికేషన్‌?

  • ఏడు దశల్లో ఎన్నికలు

తిరువనంతపురం : 2024 లోక్‌సభ ఎన్నికల తేదీని ఈ నెల రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 15, 16 తేదీల్లో నోటిఫికేషన్‌ వెలువడుతుందని, 2019 ఎన్నికల మాదిరిగానే ఏడు దశల్లో ఓటింగ్‌ జరుగుతుందని సమాచారం. మొదటి దశ ఏప్రిల్‌ రెండో వారంలో ఉంటుందని కొన్ని జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. ఈ నెల 14 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుందని, అందుకే ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలు ఈ తేదీలల్లోపు జాబితా చేయబడ్డాయని వార్తా సంస్థలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చో లేదో తెలుసుకోవడానికి కమిషన్‌ ప్రతినిధులు ఈ నెల 12-13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు.జిల్లా ఎన్నికల అధికారులకు పంపిన సర్క్యులర్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీని ఏప్రిల్‌ 16, 2024గా పేర్కొన్నారు. తరువాత, ప్రధాన ఎన్నికల అధికారి ఒక సర్క్యులర్‌ ద్వారా ఇది ఎన్నికల తేదీ కాదని, ప్రణాళిక మరియు సూచన కోసం సిద్ధం చేయడానికి ఇచ్చిన తేదీ అని స్పష్టం చేశారు.కాగా, 195 మందితో కూడిన జాబితాను బిజెపి ఇప్పటికే విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్‌ షా, ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఇండియా వేదికలో సీట్ల పంపకం చర్చలు జరుగుతున్నాయి. తాము బీజేపీలా తొందరపడడం లేదని కాంగ్రెస్‌ వివరించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల జాబితాను వామపక్షాలు ఇప్పటికే విడుదల చేశాయి.

➡️