పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను రద్దు చేసిన యుపి ప్రభుత్వం

లక్నో : ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను యుపి ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘యుపి పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌ పోలీసు పరీక్షలు 2023 రద్దయ్యాయి. వచ్చే ఆరు నెలల్లో పరీక్షలను తిరిగి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాము. పేపర్‌ లికేజీలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఇక పేపర్‌ లీకేజీకి గల కారణాలను పరిశోధించాలని యుపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులైన రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ (ఆర్‌వో/ఎఆర్‌వో) స్థాయిలో కూడా పరిశోధించాలని యుపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు @[email protected] ఫిర్యాదు చేయవచ్చు.  కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో ఆరోపించిన రిగ్గింగ్‌పై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కూడా దర్యాప్తు చేస్తోంది అని యుపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీకేజ్‌ వల్ల దాదాపు రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ప్రజలు నష్టపోయారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌ యుపి ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ కూడా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. యోగి ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టిస్తుందని రాహుల్‌ విమర్శించారు.

➡️