లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం

Dec 26,2023 11:00 #child labour
  • బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ : 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న అంతర్జాతీయ సమాజ లక్ష్యాన్ని చేరుకోవడం మన దేశానికి ఆచరణ సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తేల్చేసింది. కార్మికులు, జౌళి, నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటు చేసిన స్టాండింగ్‌ కమిటీ తన 52వ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న బాల కార్మికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ధారణకు వచ్చింది. కమిటీ తన నివేదికను ఇటీవలే పార్లమెంటుకు సమర్పించింది. అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే కార్యాచరణ ఆధారిత విధానాన్ని రూపొందించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు సూచించింది.

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి భర్తృహరి మహతాబ్‌ నేతృత్వం వహించారు. చిన్నారులను బలవంతంగా పనిలో దింపడాన్ని, బాలల అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే ప్రభుత్వం సమర్ధవంతమైన చర్యలు చేపట్టాలని కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఈ అంశానికి సంబంధించిన వారితో విస్తృత చర్చలు జరిపిన కమిటీ తన నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. చిన్నారులను కార్మికులుగా పెట్టుకుంటున్న యజమానులపై ఎన్నిసార్లు జరిమానాలు విధించినప్పటికీ వారు ఆ పిల్లలను మరోసారి అదే పనిలో పెట్టుకుంటున్నారని తెలిపింది. యజమానులపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది. జరిమానాలను మూడు నాలుగు రెట్లు పెంచడంతో పాటు లైసెన్సుల రద్దు, ఆస్తుల జప్తు వంటి కఠిన శిక్షలు విధించాలని సిఫారసు చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా మంత్రిత్వ శాఖ నుంచి సేకరించిన సమాచారాన్ని కమిటీ తన నివేదికలో ఉటంకించింది. వివిధ రంగాలలో 1.01 కోట్ల మంది పిల్లలు పని చేస్తున్నారని తెలిపింది. ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన బాల కార్మికుల సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం 57,54,201గా ఉంది. వీరంతా 5-14 సంవత్సరాల మధ్య వయసున్న వారే. వీరు వ్యవసాయం, మైనింగ్‌తో పాటు ఎనిమిది రకాల పరిశ్రమలలో పని చేస్తున్నారు.

➡️