రామ మందిర నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం : మోడీ

Jan 22,2024 16:39 #Ayodhya, #modi

అయోధ్య (ఉత్తరప్రదేశ్‌) : రామ మందిర నిర్మాణం భారత సమాజ పరిపక్వతకు అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం (జనవరి 22) అయోధ్యలో మోడీ రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరైన ప్రముఖలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ”రామ్‌లల్లా విగ్రహావిష్కరణ ఘట్టం కేవలం విజయం మాత్రమే కాదు. గర్వంగా కూడా ఉంది. రామ మందిర నిర్మాణం భారతీయ సమాజ పరిక్వతకు ప్రతిబింబం. చాలా దేశాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ప్రపంచ చరిత్రే చెబుతుంది. కానీ మన దేశం చరిత్ర ముడులను విప్పిన తీరు మన గతం కంటే మన భవిష్యత్తు మరింత అందంగా ఉండబోతోందనడానికి నిదర్శనం. అగ్ని తుఫానుగా పిలిచే ఈ ఆలయ నిర్మాణం దేశ శాంతి, సహనం, సామరస్యం, సమైక్యతకు ప్రతీక. అయోధ్య దేవాలయం రాముడి రూపంలోని జాతీయ చైతన్యానికి సంబంధించిన దేవాలయం. ఈరోజు అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగడమే కాదు. శ్రీరాముడి రూపంలో వ్యక్తమైన భారతీయ సంస్కృతిపై అచంచలమైన విశ్వాసం యొక్క జీవనాధారం కూడా ఇదే. ఈ ఆలయం దిశానిర్దేశం చేస్తుంది. ఈరోజు ఈ క్షణం ఎంతో పవిత్రమైనది. గత 11 రోజులుగా వివిధ భాషలలో రామయణాన్ని విన్నాను. నవంబర్‌ 9, 2019న సుప్రీంతీర్పు ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టును కృతజ్ఞతలు. చట్టానికి అనుగుణంగా ఆలయాన్ని నిర్మించారు.’ అని మోడీ అన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ఆ రాష్ట్ర సిఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

➡️