కెనడాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం : ప్రధాని మోడీ

Jun 11,2024 08:08 #Canada, #PM Modi

న్యూఢిల్లీ : పరస్పర అవగాహన ప్రాతిపదికగా కెనడాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా వున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీకి శుభాకాంక్షలు తెలియచేస్తూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెయు అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనిపై మోడీ స్పందిస్తూ ట్రుడెయుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకరి ఆందోళనలను మరొకరు అర్ధం చేసుకుని గౌరవించే పద్ధతిలో పరస్పర అవగాహనతో కెనడాతో పనిచేయడానికి భారత్‌ ఎదురుచూస్తోందన్నారు. తనకు అభినందనలు తెలియచేసిన పలువురు ప్రపంచ నేతలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయా దేశాలతో సుహృద్భావ సంబంధాలు నెరిపేందుకు తాము కట్టుబడి వున్నామని చెప్పారు. ఫిన్లాండ్‌ ప్రధాని ఓర్పోకు పంపిన సందేశానికి సమాధానం పంపుతూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్‌ ఎదురుచూస్తోందన్నారు. స్లొవేనియా, ఉగాండా నేతలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌, ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టపడాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్‌, ఆఫ్రికా ప్రజల ఆకాంక్షలు ఒక్కటేనని, వారి లక్ష్యాలు కూడా ఒకటేనన్నారు.

➡️