ప్రధాని మోడీ షహన్‌షా : ప్రియాంకాగాంధీ

May 5,2024 00:39 #PRIYANKA, #priyanka gandhi

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ‘షహన్‌షా’ (రాజాధి రాజు) అని, ప్యాలెస్‌లలో నివసిస్తూ ప్రజలతో సంబంధాలు లేకుండా ఉంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అన్నారు. తన సోదరుడు రాహుల్‌ గాంధీని ‘షెహజాదా (యువరాజు)’ అని ప్రధాని సంబోధించిన నేపథ్యంలో ఆమె ప్రతిస్పందించారు. గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం లఖానీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ”ఆయన నా సోదరుడిని ‘షెహజాదా’ అని పిలుస్తాడు. ఈ షెహజాదా కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు 4,000 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలను వినడానికి, నా సోదరులు, సోదరీమణులు, రైతులు, కూలీలను కలుసుకుని వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నారు’ అని అన్నారు. ”మరోవైపు మీ ‘షహన్‌షా’ నరేంద్ర మోడీ. రాజభవనంలో నివసిస్తున్నాడు. దుమ్మదూళి లేకుండా శుభ్రంగా ఉండే ఆయనను టివిలో చూసారా? ఆయన మీ కష్టాన్ని, మీ వ్యవసాయాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? ద్రవ్యోల్బణంతో మీపై ఎక్కువ భారం పడుతుందని ఎలా అర్థం చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. ”రాజ్యాంగంలో మీకు ఇచ్చిన అన్ని హక్కులను తగ్గించాలని, బలహీనపరచాలని వారు కోరుకుంటున్నారు. పదేళ్లలో మోడీ చేసిన అతి పెద్ద పని ప్రజల హక్కులను నిర్వీర్యం చేయడమే’ అని ఆమె అన్నారు. గుజరాత్‌ ప్రజలతో తెగతెంపులు చేసుకోకుంటే ఆయన ఎందుకు గుజరాత్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ”భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, పాకిస్తాన్‌ గురించి మాట్లాడుతున్నారు… దేశ ప్రధానమంత్రి ఇంత తక్కువ స్థాయి మాటలు మాట్లాడుతున్నారా? దేశం గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి మీరు ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు, దేశం మొత్తం ఆయన మాట్లాడే మాటల భావాన్ని చూడగలదు” అని అన్నారు. ప్రధాని అన్ని ప్రకటనలు చేస్తున్నా హిందూ-ముస్లిం సమస్యగా ఎన్నికలు మారకూడదని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ‘సమానత్వం రాజ్యాంగంలో పొందుపరచబడింది. సమానత్వం కోసం పోరాడుతున్న వారు రాజ్యాంగ వ్యతిరేకులని ప్రధానమంత్రి చెబుతున్నారు. మిమ్మల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం చేసుకోవాలి” అని ఆమె అన్నారు.

➡️