21న బిజెపి, ఎన్‌డిఎ ఎంపిల ఇళ్ల వద్ద నల్లజెండాలతో నిరసన

Feb 19,2024 10:27 #Farmers Protest, #SKM leaders

 సంయుక్త కిసాన్‌ మోర్చా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2021 డిసెంబరు 9న ఎస్‌కెఎంతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తోపాటు కనీస మద్దతు ధర సి2ం50 శాతం ప్రకారం పంటలను సేకరించాలని, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న బిజెపి, ఎన్‌డిఎ పార్లమెంటు సభ్యులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నల్లజెండాలు ప్రదర్శించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) రైతులకు పిలుపునిచ్చింది. ‘కరెంటు ప్రైవేటీకరణ ఆపాలి. లఖింపూర్‌ ఖేరీలో రైతుల మారణకాండకు ప్రధాన సూత్రధారి కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనిని తొలగించి, విచారించాలి. పంజాబ్‌ సరిహద్దులో రైతుల అణచివేతను అరికట్టాలి’ అని డిమాండ్‌ చేసింది. రైతు వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, అణచివేత, నియంతృత్వ వైఖరిని బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేసింది. పంజాబ్‌లో మూడురోజులపాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, బిజెపి జిల్లా అధ్యక్షుల ఇళ్ల ముందు రాత్రి, పగలు భారీ నిరసనలు చేపట్టాలని ఎస్‌కెఎం నిర్ణయించింది. ఈ నిరసన ఈ నెల 20 ఉదయం 10 గంటలకు ప్రారంభమై 22న సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని తెలిపింది. ఎలక్టోరల్‌ బాండ్లతో అవినీతిని చట్టబద్ధం చేసి వేల కోట్ల రూపాయలను బిజెపి ఎన్నికల ఫండ్‌గా పోగు చేయడాన్ని ఎస్‌కెఎం తీవ్రంగా ఖండించింది. దీనిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎస్‌కెఎం స్వాగతించింది.

➡️