నీట్‌పై లోక్‌సభలో చర్చించాలి.. ప్రధాని మోడీకి రాహుల్‌ లేఖ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్‌ అంశంపై లోక్‌సభలో బుధవారం చర్చించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. 24 లక్షల మంది నీట్‌ అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా నిర్మాణాత్మకంగా వ్యవరించడం తమ లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్చకు ప్రధాని నాయకత్వం వహించడం సముచితమన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో జూన్‌ 28న ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు కోరగా, తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరోసారి చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా..అందుకు లోక్‌సభ స్పీకర్‌ ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారని రాహుల్‌ తన లేఖలో గుర్తు చేశారు. లక్షల కుటుంబాలు తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలు వృధా కారాదని తెలిపారు. నీట్‌ పేపర్‌ లీక్‌ అనేది ఎంతో మంది అభ్యర్థుల చిరకాల స్వప్నాలను ఛిద్రం చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ధైర్యంగా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. ఏడేళ్లలో 70పైగా పేపర్లు లీక్‌ అయ్యాయని, దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని లేఖలో పేర్కొన్నారు.

➡️