యడ్యూరప్పకు ఊరట

Jun 14,2024 23:35 #judgement, #Karnataka High Court

తదుపరి విచారణ వరకూ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం
బెంగళూరు : పోక్సో చట్టం కింద నమోదైన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఆ రాష్ట్ర హైకోర్టు ఊరట కలిగించింది. తదుపరి విచారణ వరకూ అరెస్టు చేయవద్దని పోలీసుల్ని శుక్రవారం ఆదేశించింది. 17 ఏళ్ల బాలికపై వేధింపుల కేసులో యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు (పోక్సో కోర్టు) గురువారం సాయంత్రం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఒక పిటీషన్‌ను, సెషన్‌ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ ఆధారంగా తనను అరెస్టు చేయవద్దని కోరుతూ మరొక పిటీషన్‌ను హైకోర్టులో ఆయన దాఖలు చేశారు. ఈ పిటీషన్లను శుక్రవారం జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ విచారించారు. ఈ కేసు విచారణ కోసం సిఐడి ముందు యడ్యూరప్ప హాజరైన విషయాన్ని, విచారణకు సహకరించిన విషయాన్ని కోర్టు గుర్తించింది. ఈ నెల 17న సిఐడి ముందు విచారణకు హాజరవుతానని యడ్యూరప్ప తెలిపిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో తదుపరి విచారణ వరకూ యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
2012 ఫిబ్రవరిలో సహాయం కోరి తన తల్లితోపాటు వచ్చిన 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప తన నివాసంలోనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

➡️