ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి బాబ్రీ కూల్చివేత, గుజరాత్‌ నరమేధం తొలగింపు

వామపక్షాల నిర్వచనాన్ని మార్చేశారు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ నరమేధం అంశాలను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి తొలగించారు. వామపక్షాలకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా మార్చేశారు. ఆరెస్సెస్‌కు చెందిన మనుషులతో ఎన్‌సిఇఆర్‌టిని కేంద్ర ప్రభుత్వం నింపేసిన తరువాత పాఠ్య పుస్తకాల నుంచి లౌకికత్వ అంశాలను ఒక్కొక్కటి తొలగించేస్తున్నారు. ఆ క్రమంలో 2002లో రెండు వేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్‌ నరమేధాన్ని,, దేశ లౌకిక స్పూర్తిని మంట గలిపిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించిన వాస్తవాలను భావి తరాలకు తెలియకుండా చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ మార్పులు రొటీన్‌ అప్‌డేట్‌లో భాగమని ఎన్‌సిఇఆర్‌టి అధికారులు తెలిపారు. పదకొండు, పన్నెండు తరగతుల పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకాల నుంచి ఈ అంశాలను తొలగించారు.
ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ ముసాయిదా కమిటీ రూపొందించిన మార్పులను వివరించే పత్రం ప్రకారం, ”రాజకీయాల్లో ఇటీవలి పరిణామాల దఅష్ట్యా” రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించిన ప్రస్తావనలోనూ మార్పులు చేశారు.
అంతకుముందు, 11వ తరగతి పాఠ్యపుస్తకంలోని సెక్యులరిజంపై ఎనిమిదవ అధ్యాయంలో ”2002లో గుజరాత్‌లో గోధ్రా అనంతర అల్లర్ల సమయంలో 1,000 మందికి పైగా ముస్లింలు మరణించారు.” అని ఉంది. దానిని ‘2002లో గుజరాత్‌లో గోద్రా అనంతర అల్లర్లలో 1,000 మందికి పైగా మరణించారు” అని మార్చారు. ఈ మార్పు వెనుక ఎన్‌సిఇఆర్‌టి తర్కం ఏమిటంటే, ”ఏదైనా అల్లర్లు అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒక్క శాఖ గురించే పేర్కొనడం సరికాదు”.
12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకంలోని ఏడవ అధ్యాయంలో ఆర్టికల్‌ 370ని రద్దును సమర్థించుకునే విధంగా పద ప్రయోగాల్లో మార్పులు చేసింది.” జమ్మూ కాశ్మీర్‌ కోసం ప్రత్యేక నిబంధనలు కలిగిఉన్న ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టులో రద్దు చేయడం జరిగింది” అని సవరించారు. అలాగే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతాన్ని పాకిస్తాన్‌ ‘అజాద్‌ పాకిస్తాన్‌’ అని పిలుస్తుందని ఇప్పటివరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లో ఉండగా, ఇప్పుడు ఆ వాక్యాన్ని సవరించి ”పాకిస్తాన్‌ అక్రమంగా ఆక్రమించిన భూభాగం ఇది, దీనిని ”పాక్‌ అక్రమిత జమ్మూ కాశ్మీర్‌” అని పిలుస్తారని పేర్కొంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సంబంధించిన ప్రస్తావనలోనూ మార్పులు చేసింది. మానవ హక్కుల కమిషన్‌ దేశంలో వివిధ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు చేపడుతుందని, మానవ హుందాగా జీవించడం కోసం పోరాడాల్సిన ఆవశ్యకత గురించి, మానవ హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తుందని ఇంతకుముందున్న పాఠ్య పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు మార్చిన తరువాత ఇలా పేర్కొంది.”మానవ హక్కుల కమిషన్‌ దేశంలో వివిధ రంగాల్లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను దేశ ప్రజల దృష్టికి తెస్తుంది” అని ఉంది. అదే పాఠ్యపుస్తకంలో మూడవ అధ్యాయంలో వామపక్షాలకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా మార్చేసింది. ఇంతకుముందున్న వెర్షన్‌లో ”వామపక్షాలు పేదలు, అణచివేతకు గరైన వారికి అనుకూలమైన ప్రభుత్వ విధానాలను సమర్థించేవారిని వామపక్షవాదులు అంటారు ” అని ఉంది. మార్చిన వెర్షన్‌లో ఏం చెప్పారంటే, ”ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, స్వేచ్ఛా మార్కెట్‌ పోటీని ప్రభుత్వం రెగ్యులేట్‌ చేయాలని వాదించే వారు వామపక్షవాదులు” అని పేర్కొంది.
సిబిఎస్‌ఇ స్కూళ్లకు ఎన్‌సిఇఆర్‌టి గత వారం జారీ చేసిన సర్కులర్‌లో మూడవ తరగతి నుండి ఆరవ తరగతి పాఠ్య పుస్తకాల్లో కొత్త పాఠ్య పుస్తకాలను తయారు చేశామని, మిగతా క్లాసులకు ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. ఇప్పటికే నూతన అకడమిక్‌ సెషన్‌ ప్రారంభమైంది. ఈ మార్పులు చేర్పులు చేసిన పాఠ్య పుస్తకాలు ఇంకా మార్కెట్‌లోకి ఇంకా రావాల్సి ఉంది.

➡️