ఎస్టీ జాబితా నుంచి కుకీల తొలగింపు !

Jan 10,2024 10:11 #cookies, #list, #Removal, #ST
  • పరిశీలించాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం

న్యూఢిల్లీ : షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి కుకీలు, జోమీలను తొలగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ సర్కారును కోరింది. ఎస్టీల జాబితా నుండి కుకీ, జోమీ తెగలను తొలగించాలంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథావలే) జాతీయ కార్యదర్శి మహేశ్వర్‌ తౌనావోజమ్‌ గత నెల 11న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండాకు లేఖ రాశారు. ఎస్టీల నిర్వచనానికి స్థానికతనే ప్రామాణికంగా తీసుకోవాలని అందులో సూచించారు. ఈ అభ్యర్థనను పరిశీలించాలంటూ కేంద్రం మణిపూర్‌ ప్రభుత్వానికి సూచించింది.

మణిపూర్‌ రాష్ట్ర ఎస్టీ జాబితాలో ఎవరెవరు ఉండాలో నిర్థారించాలని మహేశ్వర్‌ ఆ లేఖలో కోరారు. అయితే మైతీలను ఎస్టీల జాబితాలో చేర్చాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ అభ్యర్థనను కేంద్రం మణిపూర్‌ ప్రభుత్వానికి పంపుతూ దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులు అవసరమని తెలియజేసింది. కాగా గత సంవత్సరం నవంబరులో కూడా ప్రపంచ మైతీల మండలి ఇదే రకమైన అభ్యర్థన చేసింది. రాష్ట్రంలోని కుకీలు మయన్మార్‌ నుండి వలస వచ్చి మణిపూర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారని, వారు స్థానికులు కారని వివరించింది. రాష్ట్ర జనాభాలో 60%గా ఉన్న మైతీలు తమను ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ అనేక సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. మైతీలను ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సత్వర నిర్ణయం తీసుకోవాలని మణిపూర్‌ హైకోర్టు గత ఏప్రిల్‌ 19న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మే 3న రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కుకీలు, మైతీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అరవై వేల మంది నిరాశ్రయులయ్యారు.

➡️