మణిపూర్‌లోని 11 పోలింగ్‌ స్టేషన్లలో ఏప్రిల్‌ 22న రీపోలింగ్‌

Apr 21,2024 10:56 #11, #Manipur, #polling stations, #Repolling

మణిపూర్‌ : మణిపూర్‌లో ఏప్రిల్‌ 19న ఓటింగ్‌ వేళ … హింసాత్మక ఘటనలు జరిగాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో … మణిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ స్టేషన్లలో ఏప్రిల్‌ 22న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఈ స్టేషన్లలో ఏప్రిల్‌ 19న జరిగిన ఓటింగ్‌ చెల్లదని ప్రకటించింది. తాజాగా ఓటింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
మణిపూర్‌ ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ … ఖురారు నియోజకవర్గంలోని మొయిరంగ్‌కంపు సజేబ్‌, తొంగమ్‌ లీకై, ఛెత్రిగావ్‌లో నాలుగు, ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒకటి ప్రభావితమైనట్లు తెలిపారు. ఇన్నర్‌ మణిపూర్‌, ఔటర్‌ మణిపూర్‌ అనే రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం 72 శాతం ఓటింగ్‌ నమోదైంది. శుక్రవారం ఓటింగ్‌ ముగిసిన తర్వాత సంఘర్షణతో కూడిన మణిపూర్‌లోని 47 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం రాష్ట్రంలోని రెండు పార్లమెంట్‌ స్థానాలు, ఇన్నర్‌ మణిపూర్‌ నియోజకవర్గంలోని అన్ని బూత్‌లు, ఔటర్‌ మణిపూర్‌ నియోజకవర్గంలోని కొన్ని బూత్‌లలో మొదటి దశ ఓటింగ్‌ జరిగింది. ఔటర్‌ మణిపూర్‌లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏప్రిల్‌ 26న రెండో దశ ఓటింగ్‌ జరగనుంది.
రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కీశం మేఘచంద్ర సింగ్‌ శుక్రవారం మాట్లాడుతూ, రిగ్గింగ్‌ గురించి భారత ఎన్నికల సంఘం, మణిపూర్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసామన్నారు. ఇన్నర్‌ మణిపూర్‌లోని 36 పోలింగ్‌ స్టేషన్‌లలో, ఔటర్‌ మణిపూర్‌లోని 11 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. తౌబాల్‌ జిల్లాలోని వాంగ్‌ఖేమ్‌ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కీశం మేఘచంద్ర సింగ్‌ మాట్లాడుతూ … ”పోలింగ్‌ స్టేషన్‌లలో ఏజెంట్లు కూర్చోలేరు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చే ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ స్టేషన్‌లలో ఓటు వేయలేరు” అని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని సీపీఐ(ఎం) కార్యదర్శి క్షేత్రమయం శాంత ఆరోపించారు. ఓటర్ల హక్కులకు భంగం వాటిల్లింది. ప్రతిపక్ష భారత వర్గానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ, పాలక ఫ్రంట్‌ ఇలాంటి చర్య దురదృష్టకరమని ఆరోపించారు.

➡️