29న కేరళ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ

Dec 25,2023 11:31 #kerala, #state cabinet meeting

తిరువనంతపురం :   కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 29న జరగనుంది. ఇద్దరు నూతన మంత్రులు ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారని, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వారి పోర్టుఫోలియోలను నిర్ణయించనున్నారని ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఇపి జయరాజన్‌ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం తరువాత ఆయన మాట్లాడుతూ 2012లో రెండోసారి విజయన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో నాలుగు మిత్రపార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు రెండున్నర సంవత్సరాల కాల పరిమితితో మంత్రి పదవి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇద్దరు మంత్రుల కాల పరిమితి ఈ ఏడాది నవంబర్‌లోనే పూర్తయిందని, అయితే ‘నవకేరళ సదస్సు’ కారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యమయిందని తెలిపారు. ప్రస్తుత మంత్రులు డెమోక్రటిక్‌ కేరళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆంటోని రాజు, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ దేవర కోవిల్‌ స్థానంలో కేరళ కాంగ్రెస్‌(బి) ఎమ్మెల్యే కెబి గణేష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ (ఎస్‌) ఎమ్మెల్యే కాదనపల్లి రామచంద్రన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారని జయరాజన్‌ చెప్పారు. ఆంటోని రాజు, అహ్మద్‌ దేవర కోవిల్‌ ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి విజయన్‌కు రాజీనామా లేఖలు సమర్పించినట్లు తెలిపారు.

➡️