ఎంపిలకు వివరణ కోరే హక్కు ఉంది : శరద్‌ పవార్‌

Dec 19,2023 14:52 #Parliament, #sharad pawar, #Suspension

న్యూఢిల్లీ :    ప్రతిపక్ష ఎంపిలకు వివరణ కోరే హక్కు ఉందని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఎంపిల సస్పెన్షన్‌ను ఖండిస్తూ మంగళవారం రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌కి లేఖ రాశారు. పార్లమెంటు భద్రతపై వివరణ కోరేందుకు ఎంపిలకు చట్టబద్ధమైన హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం జవాబు దారీ తనం, పారదర్శకత సూత్రాలకు  విరుద్ధమని  అన్నారు. ఎంపిల ఆందోళనలు ఘటన తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యులు వివరణ కోరడం సాధారణమేనని, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఆందోళన చేపట్టిన ఎంపిలను సస్పెండ్‌ చేయడం సరికాదని అన్నారు. ఆందోళనలో పాల్గొనని  సభ్యులను కూడా సస్పెండ్‌ చేశారని ఎత్తి చూపారు. కాగా,  ఇవి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న చివరి సమావేశాలు కావడం గమనార్హం.

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్రం హోం మంత్రి అమిత్‌షా వివరణనివ్వాలంటూ గత వారంరోజులుగా ప్రతిపక్ష ఎంపిలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 140 మంది ప్రతిపక్ష ఎంపిలు సస్పెండ్‌కు గురయ్యారు.

➡️