రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం

జైపూర్‌ : రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్‌ గరసియా, మదన్‌ రాథోర్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైట్లు తెలిపారు. రాజసభ్య ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడవు మంగళవారంతో ముగిసింది. దీంతో ఈ ఫలితాలను అధికారులు వెల్లడించారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మన్మోహన్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), భూపేంద్ర యాదవ్‌ (బిజెపి) పదవీ కాలం ఏప్రిల్‌ 3తో ముగియనుంది. అలాగే డిసెంబరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో కిరోడి లాల్‌ మీనా (బిజెపి) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజస్థాన్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుత ఫలితాలతో రాజస్థాన్‌ నుంచి కాంగ్రెస్‌కు ఆరుగురు, బిజెపికి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అలాగే బీహార్‌ నుంచి కూడా ఆరుగురు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భీం సింగ్‌, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ధర్మశీల గుప్తా, ఆర్‌జెడి నుంచి మనోజ్‌ జా, పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు రాజకీయ సలహాదారు అయిన సంజరు యాదవ్‌ ఎన్నికయ్యారు. కాగా కాంగ్రెస్‌ నుంచి పిసిసి అధ్యక్షులు అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (సిట్టింగ్‌ ఎంపీ కూడా), జెడియు నుంచి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన సంజరు జా ఎన్నికయ్యారు. సంజరు..గత మహాఘట్బంధన్‌ ప్రభుత్వంలో కేబినెట్‌లోనూ మంత్రిగా ఉన్నారు.

➡️