శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ కన్నుమూత

Nov 21,2023 11:36 #chennai, #founder, #netralayam, #passed away

చెన్నై : ప్రఖ్యాతి పొందిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ విట్రరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ (83) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా బద్రినాథ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీసెంట్‌ నగర్‌ శ్మశాన వాటికలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 ఫిబ్రవరి 24న చెన్నైలో బద్రినాథ్‌ జన్మించారు. 1962 మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి పట్టబద్రులయ్యారు. తరువాత అమెరికా వంటి దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం 1970ల్లో స్వదేశానికి తిరిగివచ్చారు. 1978 వరకూ వివిధ ఆసుపత్రుల్లో పనిచేశారు. 1978లో డాక్టర్‌ బద్రినాథ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ విభాగంగా శంకర నేత్రాలయను స్థాపించారు. బద్రినాథ్‌కు 1983లో పద్మశ్రీ, 1999లో పద్మభూషణ్‌ అవార్డులు లభించాయి. కాగా, తన మరణం తరువాత భారీ ఏర్పాట్లు చేయరాదని, తనకు నివాళులర్పిస్తున్న కారణంగా శంకర నేత్రాలయలో ఒక్క నిమిషం కూడా వైద్య సేవలు ఆగకూడదంటూ బద్రినాథ్‌ ముందుగానే సూచనలు ఇచ్చారు.

➡️