ఎలక్ట్రానిక్‌ పరికరాల స్వాధీనంపై మార్గదర్శకాలేవీ ? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

Dec 7,2023 09:45 #Supreme Court
supreme court on electrical equipment

అస్పష్టత కొనసాగడంపై అసహనం
90 మంది జర్నలిస్టుల నుండి 300 పరికరాలు : కేంద్రం

న్యూఢిల్లీ : విద్యావేత్తలు, మీడియా సిబ్బంది నుండి మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతో సహా వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్న సందర్భాల్లో అనుసరించేందుకు మార్గదర్శకాలను రూపొందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అస్పష్టతతోనే వుంది. దాదాపు రెండేళ్ళ నుండి ఈ మార్గదర్శకాలను రూపొందించడంలో ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోందని జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది. ‘ఎప్పుడు మార్గదర్శకాలతో మీరు వస్తారు?” అని జస్టిస్‌ కౌల్‌ కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజును ప్రశ్నించారు. దీనిపై కమిటీ కసరత్తు చేస్తోందని, వచ్చే వారానికల్లా తమకు మార్గదర్శకాలు అందవచ్చని రాజు చెప్పారు. తనకు ఆరోగ్యం బాగా లేనందున దీనిపై పురోగతి తెలియదని చెప్పారు. దాంతో డిసెంబరు 14కి కేసు విచారణను వాయిదా వేశారు. వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకోరాదని, వాటిని నిరవధికంగా దర్యాప్తు సంస్థల అధీనంలో వుంచుకోరాదని పిటిషనర్లు తరపున సీనియర్‌ న్యాయవాదులు నిత్యా రామకృష్ణ, ప్రసన్నలు పేర్కొన్నారు. కావాలంటే ఆ పరికరాల్లోని సమాచారాన్ని కాపీ చేసుకోవాలన్నారు. ప్రతిపాదిత మార్గదర్శకాలకు తాము విడిగా తమ సూచనలు అందచేశామని చెప్పారు. దాదాపు 90 మంది జర్నలిస్టుల నుండి 300 పరికరాలను స్వాధీనం చేసుకున్నారని, అందువల్ల దీనిపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. ‘ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ వస్తువులు స్వాధీనం చేసుకుని, మీ లేఖలు చదివితే మీకెలా వుంటుంది. జర్నలిస్టుల స్వేచ్ఛపై పూర్తి స్థాయిలో దాడి ఇది” అని నిత్యా రామకృష్ణ వాదించారు. తమ డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం తమ గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని విద్యావేత్తలు, మీడియా సిబ్బంది విమర్శిస్తున్నారు. తమ జీవిత కాలంలో చేసిన కృషి అంతా ఇలాంటి సంఘటనల వల్ల పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల న్యూస్‌క్లిక్‌ కార్యాలయంపై, జర్నలిస్టులపై దాడి కేసు, పెగాసస్‌ కేసుల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జర్నలిస్టుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా నిబంధనలు, విధి విధానాలు రూపొందించే విషయంలో తక్షణమే జ్యుడీషియల్‌ జోక్యం చేసుకోవాలని కోరుతూ 16 మీడియా సంస్థలు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి విదితమే.

➡️