పౌరసత్వ చట్టం సెక్షన్‌ 6ఎ చెల్లుబాటుపై సుప్రీం తీర్పు రిజర్వ్‌

Dec 13,2023 10:52 #Section 6A, #Supreme Court
supreme court on section 6a of citizenship act

న్యూఢిల్లీ : పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తున్న పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం రిజర్వ్‌ చేసుకుంది. భారత్‌లోకి విదేశీయులు అక్రమంగా వలస రావడంపై కచ్చితమైన డేటాను అందించలేమని కేంద్ర హోం శాఖ కోర్టుకు తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి అనేకమంది విదేశీ జాతీయులు రహస్యంగా ప్రవేశించారని, అందువల్ల వారికి సంబంధించి కచ్చితమైన డేటాను అందించడం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. 2017, 2022 మధ్య కాలంలో మొత్తంగా 14,346మంది విదేశీయులను దేశం నుండి బయటకు పంపించారు. వీసా ఉల్లంఘనలు, అక్రమ ప్రవేశాలు, అధిక కాలం వుండడం వంటి పలు కారణాలతో వారిని బలవంతంగా తరలించారు. 1966 జనవరి, 1971 మార్చి మధ్య కాలంలో అస్సాంలోకి ప్రవేశించిన 17,861మంది శరణార్ధులకు భారత పౌరసత్వం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సరిహద్దు కంచెను పూర్తి చేయలేకపోయామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలియచేశారు. అలాగే కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలననుసరించి అక్రమ వలసదారులను ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించే వారిని అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం నేపథ్యంలో మానవతా ప్రాతిపదికన సెక్షన్‌ 6ఎను రూపొందించారని, అక్రమ వలసవాదులకు క్షమాభిక్ష పథకంగా పెట్టలేదని వాదోపవాదాల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ నిబంధనను దేశవ్యాప్తంగా లేదా బంగ్లాదేశ్‌తో సరిహద్దుల్లో వున్న అన్ని రాష్ట్రాలకు ఒకే తీరున వర్తింపజేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. కేవలం అస్సాం ఒక్కదానికే వర్తింపచేయడానికి అనుమతి లేదన్నారు. 1971 మార్చి 24ను కటాఫ్‌ డేట్‌గా సెక్షన్‌ 6ఎ పేర్కొంటోంది. 1966 జనవరి 1 తర్వాత, 1971 మార్చి 25కి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని విదేశీయులుగా ప్రకటిస్తూ, అయితే భారత పౌరులకు వుండే అన్ని హక్కులు, బాధ్యతలు వారికీ వుంటాయని తెలుపుతోంది. అయితే పదేళ్లపాటు వారు ఓటు వేసే హక్కు లేదని పేర్కొంటోంది.

➡️