ఓట్ల వివరాల వెల్లడిలో జాప్యంపై ఇసి వివరణ కోరిన సుప్రీం

న్యూఢిల్లీ : పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలవారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ సంఖ్యా వివరాలు తెలపాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ పిటీషన్‌పై స్పందించాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్‌ వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. దీనిపై వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 24న దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఎడిఆర్‌ తరుపున ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో పోల్‌ అయిన ఓట్ల సంఖ్యను విడివిడిగా ఫారం-17 సి పార్ట్‌ 1 స్కాన్డ్‌ ప్రతుల రూపంలో పొందుపరిచేలా మిగతా 2లో
చేయాలని, ఈమేరకు ఇసి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎడిఆర్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న ముగిసినా, పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత ఏప్రిల్‌ 30న ప్రచురించారు. ఏప్రిల్‌ 26న జరిగిన రెండో దశ పోలింగ్‌ శాతాన్ని నాలుగు రోజుల తరవాత అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్‌ శాతం కన్నా అయిదారు శాతం ఎక్కువగా ఏప్రిల్‌ 30న గణాంకాలు కనిపించాయి. దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయని ఎడిఆర్‌ తమ పిటిషన్‌లో పేర్కొంది. పోలింగ్‌ శాతం ప్రకటించడంలో జాప్యాన్ని కాంగ్రెస్‌, సిపిఎం వంటి పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఇప్పటికే ఈ విషయంపై లేఖలు కూడా రాసాయి.

➡️