ఒక్కరోజే 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు

Dec 19,2023 08:36 #Lok Sabha, #Opposition MPs, #suspended

న్యూఢిల్లీ  :    సుమారు 78  మంది ప్రతిపక్ష సభ్యులపై  సోమవారం ఒక్కరోజే   సస్పెన్షన్  వేటు పడింది.  పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో  మొదట 33   మందిని సస్పెండ్‌ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 30మందిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెండ్‌ చేయగా, మిగిలిన ముగ్గురిని ప్రివిలైజ్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం మరో 26 మందిని సస్పెండ్ చేశారు.

గతవారం 13 మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో మొత్తం 92 మంది సస్పెండ్‌కు గురయ్యారు.  వీరంతా భద్రతా వైఫల్యంపై  అమిత్‌షా నుండి ప్రకటన కోరినందుకు సస్పెండ్‌ వేటుకు గురవడం గమనార్హం.  వీరిలో లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్‌ గొగోయ్‌లు  ఉన్నారు.

నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం : అధిర్‌ రంజన్‌ చౌదరి

ఈ సస్పెండ్‌లపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, పార్లమెంటును  పార్టీ  ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని మండిపడ్డారు.  సెషన్‌ ప్రారంభం నుండి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ సస్పెండ్ వేటు వేసిందని ధ్వజమెత్తారు.

➡️