దగ్గు సిరప్‌లు తాపించి.. కుమారుడిని చంపిన సిఈవో

Jan 11,2024 16:10 #Bengaluru, #CEO, #Suchana Seth

పనాజి : గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని ‘మైండ్‌ఫుల్‌ ఎఐ’ సంస్థ సీఈవో దారుణంగా చంపి.. సూట్‌కేసులో కుక్కి పోలీసులకు చిక్కిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ‘జనవరి 6వ తేదీన గోవాలోని కాండలిమ్‌లోని బనియన్‌ గ్రాండ్‌ హోటల్‌లోని 404 రూమ్‌ తీసుకున్నాను. ఆ తరువాతి రోజు జనవరి 7వ తేదీన సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో రిసెప్షన్‌కి ఫోన్‌ చేసి రెండు దగ్గు సిరప్‌ బాటిల్స్‌ను తెప్పించమన్నాను. ఆ హోటల్‌ సిబ్బంది దగ్గు సిరప్స్‌ని తెచ్చి నాకు ఇచ్చారు.’ అని సుచనా సేథ్‌ పోలీసులకు తెలిపారు. హోటల్‌ స్టాఫ్‌ సిబ్బంది తెచ్చి ఇచ్చిన ఆ దగ్గు సిరప్‌ని తన కుమారుడికి తాపించిన తర్వాత మత్తుగా పడుకున్న బాబుపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘అదేరోజు రాత్రి 9.10 గంటల సమయంలో అర్జెంట్‌ వర్క్‌ వల్ల బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చిందని, క్యాబ్‌ బుక్‌ చేయమని స్టాఫ్‌కి సమాచారం ఇచ్చింది. అయితే రిసెప్షన్‌ సిబ్బంది క్యాబ్‌ కన్నా విమానం టికెట్లే చౌకగా ఉన్నాయని ఆమెకు చెప్పారు. కానీ ఆమె టాక్సీనే బుక్‌ చేయమని పట్టుబట్టింది. దీంతో మేము 30 వేలకు ఇన్నోవా క్రిస్టా క్యాబ్‌ బుక్‌ చేశాము. ఆమె అదేరోజు రాత్రి హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసింది. ఆ తర్వాత ఆమె ఉన్న రూమ్ లో రక్తపు మరకలు కనిపించాయి.’ అని ఆ హోటల్‌ సర్వీస్డ్‌ అపార్ట్‌మెంట్‌ మేనేజర్‌ గంభీర్‌ తెలిపారు.

కుమారుడి మృతదేహాన్ని తీసుకుని సుచనా క్యాబ్‌లో పారిపోతున్నప్పుడు.. గోవా సరిహద్దుల్లోని క్లోరా ఘాట్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సుచనా ట్రాఫిక్‌లో చిక్కుకోవడం వల్ల ఆమెను పట్టుకోగలిగామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

‘జనవరి 7వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో హోటల్‌ నుంచి నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. సుచనా ఒంటరిగానే ఉన్నారు. లగేజీ బరువుగా అనిపించినా నాకు పెద్దగా అనుమానం రాలేదు. ఆమె క్యాబ్‌ ఎక్కిన తర్వాత నాతో ఏం మాట్లాడలేదు. కొన్ని గంటల తర్వాత నాకు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. పోలీసులు ఆమెతో మాట్లాడాలన్నారు. ఆ సమయంలో కూడా ఆమె ఏమాత్రం భయపడలేదు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఫోన్‌ చేసి కొంకణి భాషలో మాట్లాడి దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లమని చెప్పారు. నేను ఓ రెస్టారెంట్‌ వద్ద ఆగి పోలీస్‌స్టేషన్‌కి ఫోన్‌ చేశా. ఆ తర్వాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లాను. పోలీసులు సూట్‌కేస్‌ తెరచి చూడగా బాలుని మృతదేహం ఉంది.’ అని క్యాబ్‌ డ్రైవర్‌ చెప్పాడు. ఈ ఘటనతో పోలీసులు సుచనాను అదుపులోకి తీసుకున్నారు.

➡️