బాండ్ల వివరాలు బయటపెట్టాల్సిందే

Mar 11,2024 22:30 #Electrical bonds, #SBI, #supreem court
  • ఈ రోజు సాయంత్రం వరకు గడువు
  • ఎస్‌బిఐ దరఖాస్తును కొట్టేస్తూ సుప్రీం
  • 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఇసి వెబ్‌సైట్‌లో ఉండాలి
  • 26 రోజులుగా ఏం చేశారని ఎస్‌బిఐని నిలదీసిన న్యాయస్థానం
  • రాజకీయ నిధుల్లో పారదర్శకత దిశగా ఇదొక అడుగు : సీతారాం ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను మంగళవారం సాయంత్రానికల్లా ఎన్నికల సంఘానికి ఎస్‌బిఐ సమర్పించాల్సిందేనని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. గడువు మరింత పొడిగించాలన్న స్టేట్‌ బ్యాంక్‌ దరఖాస్తును చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. గడచిన 26 రోజుల్లో ఏం చేశారని నిలదీసింది. ఎస్‌బిఐ సమర్పించిన ఎలక్టొరల్‌ బాండ్ల వివరాలను ఈ నెల 15 (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకల్లా ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపించిన ఎలక్టోరల్‌ బాండ్ల దాతలు, గ్రహీతల సమాచారం ఇచ్చే గడువును పొడగించాలని ఎస్‌బిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను, అలాగే ఎస్‌బిఐ కోర్టు ధిక్కారంపై సిపిఎం, ఎడిఆర్‌, కామన్‌ కాజ్‌లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను సోమవారం సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బిఆర్‌ గవాయి, జస్టిస్‌ జెబి పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎస్‌బిఐ తరపున హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. విరాళాలు ఎవరు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు అనే సమాచారాన్ని సరిపోల్చాలంటే సమయం పడుతుందని, ఎందుకంటే ఆ సమాచారాన్ని వేర్వేరుగా భద్రపరచడం జరిగిందని ఆయన కోర్టుకు తెలియజేశారు. ‘తప్పులు చేసి గందరగోళం సృష్టించాలని మేము అనుకోవడం లేదు. మాకు కొంత సమయం ఇవ్వండి. మేము ఆ పనిని పూర్తి చేస్తాం’ అని అభ్యర్థించారు.
దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా జోక్యం చేసుకుంటూ పొరబాటు జరిగే అవకాశమే లేదని అన్నారు. ‘మీ వద్ద కేవైసీ ఉంది. మీది దేశంలోనే నెంబర్‌ వన్‌ బ్యాంక్‌. మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారన్న విశ్వాసం మాకు ఉంది’ అని చెప్పారు. సమాచారాన్ని సరిపోల్చాలని న్యాయస్థానం తన తీర్పులో చెప్పలేదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ గుర్తు చేశారు.
మీ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా సమాచారం ఇవ్వాలని మాత్రమే కోరాం. బాండ్లు కొన్నవారి వివరాలన్నీ సీల్డ్‌ కవర్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని తెరిచి వివరాలు ఇస్తే సరిపోతుంది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని సీల్డ్‌ కవర్లో ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాం. వాటిని మేం తెరవలేదు. బాండ్ల రద్దుపై ఫిబ్రవరి 15న తీర్పునిచ్చాం. ఇవాళ (సోమవారం) మార్చి 11. ఈ 26 రోజుల్లో ఏం చర్యలు తీసుకున్నారో ఎస్‌బిఐ అప్లికేషన్‌లో పేర్కొనలేదు. మార్చి 12 సాయంత్రం పని గంటలు ముగిసేలోగా దాతల వివరాలను ఇసికి అందజేయాల్సిందే. బాండ్లు కొన్నవారి వివరాలు మీ వద్ద సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీల వివరాలు అందించడానికి మూడు వారాల గడువెందుకు. అని కోర్టు ప్రశ్నించింది. దీనికి అటు నుంచి సమాధానం లేదు.
. ఎస్‌బిఐ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎస్‌బిఐకి చెంప పెట్టు లాంటిదని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అభిప్రాయ పడ్డారు. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఎస్‌బిఐ చైర్మన్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరారు. కోర్టు ఉత్తర్వులు పాటించకకుంటే ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎలక్టొరల్‌ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ, ఈ స్కీమును ప్రవేశపెట్టిన 2019 ఏప్రిల్‌ 12 నుండి 2024 ఫిబ్రవరి 15న రద్దు చేసేవరకు ఎలక్టొరల్‌ బాండ్లను కొనుగోలు చేసినవారు, వాటిని స్వీకరించినవారి వివరాలను మార్చి 6 కల్లా వెల్లడించాలని సుప్రీం కోర్టు ఫిబ్రవరి15న ఎస్‌బిఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.
రాజకీయ నిధుల్లో పారదర్శకత దిశగా ఇదొక అడుగు: సీతారాం ఏచూరి
ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను అందజేయడానికి గడువును పొడిగించాలన్న ఎస్‌బిఐ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని సిపిఎం, సిపిఐ స్వాగతించాయి. సోమవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నిధుల్లో పారదర్శకత దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు అని వ్యాఖ్యానించారు. సుప్రీం తాజా ఆదేశం ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఏచూరి తెలిపారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్‌ బాండ్‌ పథకం ‘రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసిందన్నారు.
వారు (బిజెపి) కార్పొరేట్‌లతో డీల్స్‌ కుదుర్చుకోడానికి, రాజకీయ పక్షాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించారని, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దుష్ట సంస్కృతికి ఇదే కారణమని అన్నారు. ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు వెలువరించిన ఒక మైలురాయి వంటిదని ఆయన అన్నారు.

➡️